గండం ఉందని గల్లంతు నాటకం

25 Apr, 2022 09:07 IST|Sakshi

సురక్షితంగా ఇంటికి చేరిన అంకిరెడ్డిపల్లె మహిళ 

మూడు రోజుల ఉత్కంఠకు తెర 

కొలిమిగుండ్ల(కర్నూలు): భర్త, కుమార్తెకు ప్రాణ గండం ఉందని, దాని నుంచి వారు బయట పడేందుకు ఓ మహిళ తాను గల్లంతైనట్లు నాటకం ఆడింది. మూడు రోజుల పాటు అనంతపురంలో ఉండి ఆదివారం తాపీగా ఇంటికి చేరుకుంది. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లెకు చెందిన రసూల్‌బీతో పాటు కూతురు, బంధువులు, ఇంటి పొరుగున ఉన్న మహిళలు మొత్తం పది మంది కలిసి శుక్రవారం ఆటోలో బయలుదేరి ముందుగా తుమ్మలపెంట పొలిమేర సమీపంలో ఉన్న సుంకులమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి గొర్విమానుపల్లె సమీపంలోని లొక్కిగుండం వద్దకు చేరుకున్నారు.

రామేశ్వరస్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో  గుండంలో  నీటిలో దిగారు. రసూల్‌బీ గుండంలో గల్లంతయిందని కూతురుతో పాటు శివమ్మ, తోటి మహిళలంతా ఘంటా పథంగా చెప్పారు. అక్కడే ఉన్న పూజారితో పాటు అంకిరెడ్డిపల్లె, గొర్విమానుపల్లె గ్రామాల నుంచి భారీగా అక్కడికి చేరుకొని ఆచూకీ కోసం నీళ్లలోకి దిగి వెతకటం ప్రారంభించారు.

రాత్రంతా అక్కడే ఉండి ప్రయత్నం చేసినా కుదరలేదు. శనివారం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ సహకారంతో జనరేటర్‌ ఏర్పాటు చేసి మోటార్ల సాయంతో రాత్రి తొమ్మిది గంటల వరకు నీటిని  బయటకు పంపింగ్‌ చేశారు. కేవలం మూడు అడుగుల నీళ్లు ఉండటంతో యువకులు నీళ్లలో దిగి గుండం అంతా జల్లెడ పట్టినా ఆనవాళ్లు దొరకలేదు. చివరకు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రయత్నం చేశారు. 

తాపీగా బస్సు దిగి ఇంట్లోకి.. 
గుండంలో మూడు రోజుల నుంచి గ్రామస్తులు, బంధువులు విశ్వప్రయత్నాలు చేస్తున్న ఉత్కంఠ సమయంలో మధ్యాహ్నం తాపీగా బస్సు దిగి రసూల్‌బీ ఇంట్లోకి వెళ్లడంతో హైడ్రామా ముగిసింది. గ్రామస్తులు భారీగా ఆగ్రహావేశాలతో  ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈలోగా పోలీసులు గ్రామానికి చేరుకొని రసూల్‌బీలో పాటు తాడిపత్రిలో ఉన్న ఆమె అక్క, బావలు శివమ్మ, కార్తీక్‌ దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

భర్త, కూతురుకు ప్రాణగండం ఉందని చెప్పారని, మూడు రోజుల పాటు కనిపించ కుండా పోతే గండం తప్పి పోతుందనే ఉద్దేశంతోనే ఈ నాటకం ఆడినట్లు ఆమె పోలీసులకు చెప్పారు. అనంతపురంలో ఉండి ఆమె ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండేది. చివరకు భయపడి ఇంటికి చేరుకుంది. విచారణ కోసం అందరినీ కోవెలకుంట్ల సర్కిల్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు