ఏపీ మిగతా రాష్ట్రాలకు ఆదర్శం.. సీఎం జగన్‌పై ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలు..

27 Mar, 2023 20:44 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రపంచబ్యాంకు భారత్ విభాగం డైరెక్టర్ ఆగస్టే టానో కౌమే నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సీఎం జగన్‌తో సోమవారం భేటీ అయింది. వరల్డ్ బ్యాంకు సహకారంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలను సమీక్షించింది. ఏపీ ప్రజారోగ్య బలోపేతం, ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఎడ్యుకేషన్‌ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రాజెక్ట్ (ఏపీఐఐఏటీపీ) ప్రాజెక్టుల అమలును పరిశీలించింది.

అనంతరం ఆగస్టే టానో మాట్లాడుతూ.. సీఎం జగన్ సర్కార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌ను మిగిలిన రాష్ట్రాలు ఒక ఉదాహరణగా తీసుకుని ముందుకు సాగవచ్చు అని కొనియాడారు.

'రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. వివిధ రంగాల్లో మీరు చేరుకున్న లక్ష్యాలను ప్రత్యక్షంగా మేం చూశాం. ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదు అనే దానికి మీరు ఉదాహరణగా నిలిచారు. దీనికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా. మంచి వైద్యం, ఆరోగ్యం, మంచి విద్యను ఎలా అందించవచ్చు అన్నదానికి మీరు చక్కటి మార్గాన్ని చూపారు. నిర్దేశిత సమయంలోగా సేవలను పౌరులకు అందించడంలో మీరు గొప్ప ఉదాహరణగా నిలిచారు. దేశంలో దాదాపు 22 రాష్ట్రాలకు మేం రుణాలు ఇస్తున్నాం. వివిధ రంగాల్లో వృద్ధికోసం ఈ రుణాలు ఇస్తున్నాం. వచ్చే పాతికేళ్లలో మీ విజన్ కు, మీ మిషన్ కు ఈ సహకారం కొనసాగుతుంది.' అని పేర్కొన్నారు.

మరింత భాగస్వామ్యం ఆశిస్తున్నాం..
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం జగన్‌ ప్రపంచబ్యాంకు బృందాన్ని కోరారు. ఈ కార్యక్రమాల్లో మరింతగా ప్రపంచబ్యాంకు భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు.

'రాష్ట్రంలో మొత్తం స్కూళ్ల రూపు రేఖలన్నీ మారుస్తున్నాం. 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం.  6వ తరగతి నుంచి ఐఎఫ్పీ ప్యానెల్స్ఏర్పాటు చేస్తున్నాం.  వచ్చే జూన్‌ కల్లా వీటిని ఏర్పాటు చేస్తున్నాం.  దీంతో బోధనా పద్ధతులను పూర్తిగా మార్చివేస్తున్నాం.  డిజిటలైజేషన్ దిశగా వేస్తున్న పెద్ద అడుగు ఇది. రాష్ట్రంలో ఆరు పోర్టులు ఉన్నాయి, మరో నాలుగు వస్తున్నాయి. ఈ పోర్టు ఆధారిత పారిశ్రామిక వ్యవస్థలకు అవసరమైన నైపుణ్యం ఉన్న మానవవనరులు రాష్ట్రంలోనే తయారవుతాయి.  

ఈ కార్యక్రమాల్లో ప్రపంచబ్యాంకు భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. వైద్యారోగ్యశాఖలో కొత్తగా సుమారు 40 వేలమందికిపైగా సిబ్బందిని రిక్రూట్ చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలవుతోంది. ఆరోగ్యశ్రీని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాం.' అని సీఎం జగన్ వివరించారు.


చదవండి: గవర్నర్‌తో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ..

మరిన్ని వార్తలు