సుస్థిర హౌసింగ్‌పై చర్చిద్దాం

29 Mar, 2023 03:49 IST|Sakshi
మంగళవారం విశాఖపట్నంలో జీ20 దేశాల ప్రతినిధులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

విశాఖలో జీ20 దేశాల ప్రతినిధులతో భేటీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

ప్రతి ఒక్కరికీ సొంతింటిని సమకూర్చడమే మా లక్ష్యం 

రాష్ట్రంలో జోరుగా గృహ నిర్మాణాలు 

ఖర్చు తగ్గించడంతోపాటు నిర్మాణంలో నాణ్యత అత్యంత ప్రధానం 

మౌలిక సదుపాయాల కల్పనలో మెరుగైన విధానాలపై చర్చించాలి 

అధికారంలోకి వచ్చాక 30 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం 

22 లక్షల గృహాల నిర్మాణాన్ని చేపట్టాం 

సాక్షి, విశాఖపట్నం: మౌలిక సదుపాయాలు లాంటి కీలక రంగంపై జీ20 వర్కింగ్‌ గ్రూపు సమావేశాల్లో చర్చించడం శుభ పరిణామమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో ప్రారంభమైన జీ20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూపు సమావేశంలో మంగళవారం రాత్రి వివిధ దేశాల ప్రతినిధులనుద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు. సుస్థిరాభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని, ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ముందు­కెళ్తున్నట్లు చెప్పారు. గృహ నిర్మాణ రంగంలో కీలకమైన మౌలిక వసతులను కల్పించడంలో సుస్థిర విధానాలపై జీ20 వర్కింగ్‌ గ్రూపు ఆలోచన చేయాలని కోరారు. ‘రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.

లక్షల ఇళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రైనేజీ, రోడ్లు, కరెంట్‌.. ఇలా కనీస సదుపాయాలను కల్పించడం­లో స్థిరమైన విధానాలపై జీ20 వర్కింగ్‌ గ్రూపు ఆలోచన చేయాలని కోరు­­తున్నా. ఖర్చును తగ్గించడంతో­పాటు నిర్మాణంలో నాణ్యత అత్యంత ప్రధానం. కలల లోగిళ్లు చిరకాలం నిలిచేలా ఎలాంటి విధానాలను అనుసరించాలన్న అంశంపై చర్చించాలి. ఈ చర్చల్లో అందుకు పరిష్కార మార్గాలు దొరుకుతాయని ఆశిస్తున్నా’ అని తెలిపారు. రాష్ట్రంలో భూమి లభ్యత చాలా ఉందన్నారు. అధికారంలోకి వచ్చాక 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు 22 లక్షల గృహాల నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు.   
 
ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం.. 
జీ 20 సదస్సు సందర్భంగా విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. గన్నవరం నుంచి ఆయన రాత్రి 7.05 గంటలకు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్‌నాథ్, ఆదిమూలపు సురేష్, ఆర్కే రోజా, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్, కె.భాగ్యలక్ష్మి, శెట్టి ఫల్గుణ, నగర మేయర్‌ జి.హరివెంకటకుమారి, జెడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్కరమాని నిర్మల, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, టూరిజం స్పెషల్‌ సీఎస్‌ రజిత్‌ భార్గవ్, కలెక్టర్‌ ఏ.మల్లికార్జున తదితరులు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు.

అక్కడి నుంచి జీ 20 సదస్సు జరుగుతున్న రాడిసన్‌ బ్లూ హోటల్‌కు సీఎం చేరుకున్నారు. అంతకుముందు గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ముఖ్యమంత్రి ప్రయాణించాల్సిన విమానంలో చిన్నపాటి సాంకేతిక సమస్య ఏర్పడటంతో పది నిమిషాలు అలస్యమైంది. విమానాన్ని పూర్తిస్థాయిలో పరీక్షించిన అనంతరం పైలెట్లు ప్రయాణానికి సిద్ధం చేశారు. సాయంత్రం 6.25 గంటలకు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి సీఎం జగన్‌ విశాఖ బయలుదేరారు.  
 జీ20 సదస్సులో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో బ్రెజిల్, ఆస్ట్రేలియా ప్రతినిధులు  
 
తొలిరోజు నాలుగు సెషన్లు
జీ20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సదస్సు మంగళవారం ఉదయం విశాఖ సాగర తీరంలో ఘనంగా ప్రారంభమైంది. జీ20 ఇండియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో ఈనెల 31 వరకు నాలుగు రోజుల పాటు సదస్సు జరగనుంది. రాడిసన్‌ బ్లూ హోటల్‌లో తొలిరోజు నాలుగు సెషన్లు నిర్వహించగా 14 సభ్య దేశాలు, ఎనిమిది అతిథి దేశాలు, 10 అంతర్జాతీయ సంస్థలకు చెందిన 57 మంది ముఖ్య ప్రతినిధులు హాజరయ్యారు. నగరాలను ఆర్థిక కేంద్రాలుగా తీర్చిదిద్దడం, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడులను పెంచడం తదితర అంశాలపై చర్చించారు.

యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగాం (యూఎన్‌డీపీ), ఆర్గనేజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ (ఐఎంఎఫ్‌), ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ), యూరోపియన్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకనస్ట్రక్షన్‌ (ఈబీఆర్‌డీ) వంటి కీలక అంతర్జాతీయ సంస్థలకు చెందిన నిపుణులు సెషన్లలో పాల్గొన్నారు.

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ జియోగ్రఫీ, ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రతినిధులు జాతీయ మౌలిక సదుపాయాల వ్యయాన్ని మెరుగుపరచడంపై సదస్సులో కేస్‌ స్టడీస్‌ను సమర్పించారు. జీ 20 సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులకు రాడిసన్‌ బ్లూ హోటల్‌ ప్రవేశ ద్వారం వద్ద సన్నాయి మేళాలతో ఆహ్వానం పలికారు. అతిథుల నుదుట తిలకం దిద్ది హారతి పట్టారు. సదస్సు నేపథ్యంలో నగరంలో 2,500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హోటల్‌ ప్రాంగణంలోకి మీడియా సహా ఎవరినీ అనుమతించలేదు.  
విదేశీ ప్రతినిధులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌   
 
నేటి కార్యక్రమాలు ఇవీ.. 
 రెండో రోజు బుధవారం హోటల్‌ సమీపంలోని సాగర తీరంలో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై సంబంధిత నిపుణులతో అవగాహన కార్యక్రమాలుంటాయి. పట్టణాలు/నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా సమావేశంలో చర్చిస్తారు. 

మరిన్ని వార్తలు