YSR Kanti Velugu Scheme: మలిసంధ్యలో ‘వెలుగు’రేఖ

13 Apr, 2022 04:38 IST|Sakshi

వడివడిగా మూడో దశ వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం

ఇప్పటివరకు 19.28 లక్షల మందికి పరీక్షలు

1.44 లక్షల మందికి ఆపరేషన్లు

సాక్షి, అమరావతి: చూపు లేకపోతే లోకమంతా చీకటే. చూపు కొద్దిగా మందగించినా జీవనం కష్టమవుతూ ఉంటుంది. అందుకే వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యతాంశాల్లో రాష్ట్ర ప్రజల కంటి చూపు పరిరక్షణకు కూడా చోటిచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2019 అక్టోబర్‌ 10న శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం పిల్లలు, వృద్ధులకు వరమే అయింది. ఆరు దశల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలి రెండు దశల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 66.17 లక్షల మంది పిల్లలను పరీక్షించారు.

వీరిలో 1.58 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. 60 ఏళ్లు పైబడిన 56,88,424 మంది వృద్ధులకు కంటి పరీక్షల లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో మూడో దశ ప్రారంభించారు. ఈ కార్యక్రమం వడివడిగా జరుగుతోంది. 361 వైద్య బృందాలు నిత్యం పరీక్షలు నిర్వహిస్తున్నాయి. రోజుకు సగటున 2,500 మందికి పరీక్షలు చేస్తున్నారు. సుమారు 900 కేటరాక్ట్‌ (శుక్లాలు) ఆపరేషన్లు చేస్తున్నారు. ఇప్పటివరకు 33.90 శాతం అంటే 19,28,511 మంది వృద్ధులకు వైద్య పరీక్షలు చేశారు. వీరిలో చిన్న సమస్యలు ఉన్న 8,51,772 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 9,22,373 మందికి కళ్లద్దాలు అవసరం ఉండగా 7,90,704 మందికి ఉచితంగా పంపిణీ పూర్తయింది. 1,54,366 మంది వృద్ధులు శుక్లాల సమస్యతో బాధపడుతున్నట్టు వైద్య బృందాలు గుర్తించాయి. వీరిలో 1,44,476 మందికి ప్రభుత్వం ఉచితంగా కేటరాక్ట్‌ సర్జరీలు చేయించింది.

సెప్టెంబర్‌లోగా వృద్ధులందరికీ పరీక్షలు పూర్తి
కంటి వెలుగు వైద్య పరీక్షలు, సర్జరీల్లో వేగం మరింతగా పెంచుతాం. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి వృద్ధులందరికీ కంటి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లోగానే పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్‌ ఆర్‌ఆర్‌ రెడ్డి, రాష్ట్ర అంధత్వ నివారణ జేడీ, కంటివెలుగు సంస్థ

రూపాయి ఖర్చు లేకుండా
వయసు పైబడటంతో కంటి చూపు మందగించింది. ప్రభుత్వం వైఎస్సార్‌ కంటి వెలుగు కింద మా పీహెచ్‌సీలో గత ఏడాది ఉచితంగా కంటి పరీక్షలు చేసింది. ఉచితంగా ఆపరేషన్‌ చేశారు. తర్వాత కళ్లద్దాలు ఇచ్చారు. ప్రస్తుతం బాగా కనిపిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్‌ చేశారు. నాలాంటి ఎంతో మంది పేదలకు ఆర్థిక భారం లేకుండా చీకట్లు తొలగిస్తున్నారు.
– గోపిశెట్టి బ్రహ్మయ్య, చాగంటివారిపాలెం, ముప్పాళ్ల మండలం, పల్నాడు జిల్లా 

మరిన్ని వార్తలు