YSR Yantra Seva Scheme: ఈ నెల 7న ‘వైఎస్సార్‌ యంత్ర సేవ’ ప్రారంభం

3 Jun, 2022 11:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతాంగం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ యంత్ర సేవ పథకాన్ని 7వ తేదీన ప్రారంభించనున్నారు. పథకం కింద వివిధ జిల్లాల రైతులకు 3,800 ట్రాక్టర్లు, 300 కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌ అందిస్తారు. గుంటూరు జిల్లా కేంద్రంగా మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా మేళా ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ సి.హరికిరణ్‌ గురువారం అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్టా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు వ్యవసాయ శాఖ అధికారులు, ట్రాక్టర్‌ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 7న సీఎం చేతుల మీదుగా ఆయా జిల్లాలకు చెందిన రైతులకు 1,215 ట్రాక్టర్లు, 77 కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌ను పంపిణీ చేస్తారని, దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా  ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పంపిణీ జరిగే ప్రాంతానికి రవాణా సౌకర్యం, తాగునీరు, వసతి వంటి సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటు రాకూడదని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మేళా ప్రాంతానికి ముందుగానే యంత్రాలు చేరేలా కంపెనీ ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.  

(చదవండి: అమిత్‌ షాతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ)

మరిన్ని వార్తలు