సామాజిక న్యాయభేరీ నాదం..ప్రతిధ్వనించేలా..

24 May, 2022 12:18 IST|Sakshi

తుని నుంచి రాజమహేంద్రవరం  వరకూ బస్సు యాత్ర

రాజమహేంద్రవరంలో 27న బహిరంగ సభ

విజయవంతానికి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలకు బాధ్యతలు

సమన్వయకర్తగా మంత్రి వేణు

పార్టీ నాయకులకు వైవీ సుబ్బారెడ్డి మార్గనిర్దేశం

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతం చేసే దిశగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. బడుగు, బలహీనవర్గాలకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు ఈ యాత్ర చేపట్టాలని పార్టీ సంకల్పించింది. ఈ నెల 26న శ్రీకాకుళంలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 29న అనంతపురంలో ముగుస్తుంది. కాకినాడ జిల్లాకు 27న చేరుకునే ఈ యాత్ర తూర్పు గోదావరి జిల్లా మీదుగా సాగనుంది.

యాత్రను 17 మంది మంత్రులు అనుసరించన్నారు. ఈ రెండు జిల్లాల్లో యాత్రను విజయవంతం చేసే లక్ష్యంతో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పార్టీకి చెందిన బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు మేరుగు నాగార్జున, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఖాదర్‌బాషా తదితరులు సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు.

ఈ యాత్రను విజయవంతం చేసే దిశగా ఉదయం పూట రాజమహేంద్రవరం సంహిత కన్వెన్షన్‌.. రాత్రి అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం ఎంఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో అంతర్గత సమీక్ష నిర్వహించారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల్పిస్తున్న ప్రాధాన్యాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ఈ బస్సు యాత్ర మార్గదర్శకంగా నిలవాల్సిన అవసరాన్ని వివరించారు. 

ఉమ్మడి ‘తూర్పు’న యాత్ర సాగనుందిలా.. 
సామాజిక న్యాయభేరి యాత్ర 27వ తేదీన తుని వద్ద కాకినాడ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అనంతరం ఈ యాత్రకు ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో 16వ నంబర్‌ జాతీయ రహదారిపై ఏ–1 కన్వెన్షన్‌ వద్ద భారీ స్వాగతం పలకాలని నిర్ణయించారు. 

కత్తిపూడి సెంటర్‌లో యాత్ర కొద్దిసేపు ఆగుతుంది. అక్కడికి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణులనుద్దేశించి కొద్దిసేపు ప్రసంగించేలా టూర్‌ షెడ్యూల్‌ ఖరారు చేశారు. 

ఇందుకు సంబంధించి వేదిక, ఇతర ఏర్పాట్లు చేసే బాధ్యతను ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్‌కు అప్పగించారు. జగ్గంపేట నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించిన సందర్భంలో అక్కడి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆ బాధ్యతలు చూడాలని సమీక్షలో సుబ్బారెడ్డి నిర్ణయించారు. జగ్గంపేట నుంచి జాతీయ రహదారి మీదుగా ఈ యాత్ర తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం నగరంలోకి ప్రవేశించనుంది. 

సభా వేదికపై నిర్ణయం 
రాజమహేంద్రవరంలో నిర్వహించే బహిరంగ సభకు పక్కా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సభ ఏర్పాటుకు సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యాన రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్, మున్సిపల్‌ స్టేడియాలను పరిశీలించారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల్పిస్తున్న ప్రాధాన్యం అందరికీ తెలిసేలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సత్తా చాటాలని నేతలు పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసే దిశగా తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలతో సమన్వయం చేసుకునే బాధ్యతను రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు అప్పగించారు. రాజమహేంద్రవరం సభ విజయవంతమయ్యేలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు. 

విజయవంతానికి సుబ్బారెడ్డి పిలుపు 
ముఖ్యమంత్రి జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేస్తున్న విషయాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియచేసేలా నాయకులందరూ కలసికట్టుగా గళం వినిపించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు ఒకే మాట మీదకు వచ్చి సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి వేణు, వైఎస్సార్‌ సీపీ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (కాకినాడ), పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌(అమలాపురం), జక్కంపూడి రాజా (తూర్పు గోదావరి), ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, జ్యోతుల చంటిబాబు, డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొండేటి చిట్టిబాబు, పెండెం దొరబాబు, గెడ్డం శ్రీనివాస నాయుడు, రాష్ట్ర హౌసింగ్‌ బోర్డ్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్‌ చైర్మన్‌ కర్రి వెంకట ముకుందరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర దృశ్యకళల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కుడుపూడి సత్యశైలజ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, గుబ్బల తులసీకుమార్, గిరజాల బాబు, వాసిరెడ్డి జమీలు, అల్లి రాజబాబు, సిరిపురపు శ్రీనివాస్, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, కేపీఆర్‌ సత్తిబాబు, కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు