‘అడ్డంకులెన్నొచ్చినా ఏపీలో సంక్షేమం ఆగలేదు’.. బస్సుయాత్రలో మంత్రులు

4 Dec, 2023 17:48 IST|Sakshi

సాక్షి,అనంతపురం:ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిదేనని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అనంతరపురం జిల్లా రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో  నిర్వహించిన వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో మంత్రులు మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి మేరుగ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు డిపాజిట్లు కూడా దక్కలేదని, బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్‌కు రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను నమ్మే స్థితిలో జనం లేరన్నారు. 

మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ 

‘టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. తన ముగ్గురు భార్యలకు పవన్ కళ్యాణ్ గ్యారెంటీ ఇస్తారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఆశాకిరణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సామాజిక న్యాయం సాధ్యం అయింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టి మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి’ అని పిలుపునిచ్చారు. 

బాపట్ల ఎంపీ నందిగాం సురేష్‌ మాట్లాడుతూ 

‘తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు డిపాజిట్లు కూడా రాలేదు’ అని సురేష్‌ గుర్తు చేశారు. ‘ఇచ్చిన హామీలను ఏనాడూ చంద్రబాబు అమలు చేయలేదు. జగన్ పాలనలో 99 శాతం హామీలు నెరవేరాయి. పేదల సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుంది. టీడీపీ పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం ఉండేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ముఠా కక్షలు అంతమయ్యాయి’ అని సురేష్‌ తెలిపారు. 

ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ 

‘తెలంగాణ ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు పోటీ చేయలేదు. పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌కు డిపాజిట్లు కూడా రాలేదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు నాయుడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అత్యధికంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిదే’ అని ఎంపీ మాధవ్‌ కొనియాడారు.

పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ

‘ఎస్సీ ఎస్టీ బీసీలను కులవృత్తులకే పరిమితం చేయాలని చంద్రబాబు నాయుడు కుట్రలు చేశారు. సీఎం జగన్ పాలనలో అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం లభించింది’ అని తెలిపారు. ఈ బస్సు యాత్రలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, శంకర్ నారాయణ, డాక్టర్ తిప్పేస్వామి, అనంతవెంకటరామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీలు నందిగాం సురేష్, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, డీసీసీబీ చైర్మన్ లిఖిత, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. 

ఇదీచదవండి..అందులో కోటి 30 లక్షల మంది ప్రయాణం..

whatsapp channel

మరిన్ని వార్తలు