విశాఖలో బడుగుల విజయ నినాదం 

23 Nov, 2023 03:36 IST|Sakshi
నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన సామాజిక సాధికార యాత్ర సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం

సామాజిక సాధికార బస్సు యాత్రలకు వెల్లువెత్తుతున్న ప్రజలు 

ఒంగోలు, విశాఖ దక్షిణ, బనగానపల్లెలో అడుగడుగునా బ్రహ్మరథం 

వేలాదిగా పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 

బైక్‌లతో యువత ర్యాలీలు.. జనసంద్రాలను తలపించిన సభా ప్రాంగణాలు 

సీఎం జగన్‌ అండతో ఎదిగిన తీరును వివరించిన బడుగు, బలహీన వర్గాలు 

మళ్లీ జగనే సీఎం కావాలి అంటూ నినదించిన ప్రజలు 

ఒంగోలు, విశాఖ దక్షిణ, బనగానపల్లెలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారు హాజరై తాము సాధించిన సాధికారతను చాటి చెప్పారు. బడుగులను చంద్రబాబు దారుణంగా అవమానిస్తే.. సీఎం జగన్‌ చేయి పట్టుకొని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. సీఎం జగన్‌ అండతో తాము సమాజంలో ఎదిగిన తీరును, తలెత్తుకొని తిరగగలుగుతున్న వైనాన్ని తెలియజేశారు. 

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన చేయూత, పథకాలతో సాధికారత సాధించిన బడుగు, బలహీనవర్గాల ప్రజలు విశాఖ నగరంలో విజయ నినాదం చేశారు. వేల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు బుధవారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రను పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ జెండా ఊపి ప్రారంభించారు.

నగరంలోని డైమండ్‌ పార్క్‌ నుంచి టౌన్‌ కొత్త రోడ్డు వరకు జరిగిన ఈ భారీ యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వందలాది మోటారు సైకిళ్లతో యువత బైక్‌ ర్యాలీ చేశారు. తీన్మార్‌ డప్పులు.. డీజేలు, జానపద నృత్యాలతో యాత్ర కోలాహలంగా జరిగింది. టౌన్‌ కొత్త రోడ్డు వద్ద జరిగిన బహిరంగ సభకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. రాష్ట్రాభివృద్ధికి, ముఖ్యంగా విశాఖ నగరాభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన కార్యక్రమాలను మంత్రులు వివరిస్తుంటే సభా ప్రాంగణమంతా జై జగన్‌ నినాదాలతో దద్దరిల్లింది. 
సభలో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ 

కులగణన దేశానికే ఆదర్శం: స్పీకర్‌ తమ్మినేని 
ప్రతి కులానికీ ప్రాధాన్యం కల్పించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం చెప్పారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రపై దేశంలో చర్చ మొదలైందని, ఇది శుభపరిణామమని అన్నారు.

ఒక రాష్ట్రంలో ఇన్ని సామాజికవర్గాలకు సమాన హక్కులు కల్పించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే  సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో అన్ని సామాజికవర్గాలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, 700 మందికి డైరెక్టర్ల పదవులిచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కు మాత్రమే దక్కిందని తమ్మినేని అన్నారు. 

ముఖ్యమంత్రి జగన్‌వి సాహసోపేత నిర్ణయాలు: ఎంపీ మోపిదేవి
ప్రతి పేదవాడినీ ఆర్థికంగా బలంగా నిలబెట్టేందుకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్న ఏకైక సీఎం జగన్‌ మాత్రమేనని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ చెప్పారు. ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదంపై  వెంటనే స్పందించిన సీఎం జగన్‌.. బాధితులకు 80 శాతం సాయం చేస్తూ.. ధైర్యం అందించారని చెప్పారు. హుద్‌హుద్‌ తుపాను బాధితులకు పరిహారాన్ని అందించలేని దౌర్భాగ్యపు సీఎంగా చంద్రబాబు చరిత్రకెక్కారని ఎద్దేవా చేశారు. 

ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ ఖాదర్‌ బాషా, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కె.కె.రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు.  

ఉత్తరాంధ్ర విలువ పెరుగుతుంది: మంత్రి సీదిరి అప్పలరాజు 
రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా మారితే ఉత్తరాంధ్ర జిల్లాల యువతకు ఇక్కడే ఉపాధి లభిస్తుందని, ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తులకు విలువ పెరుగుతుందని వివరించారు. మత్స్యకార నాయకుడు పార్లమెంట్‌లో అడుగుపెట్టారంటే అది వైఎస్‌ జగన్‌  ఘనతేనని అన్నారు.

2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకి ముచ్చెమటలు పట్టించిన భరత్‌ మత్స్యకారుడేనన్నారు. 2024లో చంద్రబాబుని ఓడించి, ఇంటికి పంపేది కూడా మత్స్యకారుడేనన్న విషయం గర్వంగా చెప్పే రోజులు వచ్చాయన్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు పవన్‌ ఇచ్చే డబ్బు సినిమాల ద్వారా వచ్చినదికాదని, టీడీపీ నుంచి తీసుకున్న ప్యాకేజీ డబ్బు అని, మత్స్యకారులు ఎవరూ ఆ సొమ్ము తీసుకోవద్దని పిలుపునిచ్చారు.
 
నిజం అంటే జగన్‌.. అబద్ధం అంటే బాబు: మంత్రి చెల్లుబోయిన 
బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ నిజం అంటే జగన్‌ అని, అబద్ధం అంటే చంద్రబాబు అని చెప్పారు. మత్స్యకారులకు కష్టం వస్తే గంటలో చెక్కులు పంపిణీ చేయించిన నేత జగన్‌ నిజమైన నేత అయితే, మోసాలతో కాలం వెళ్లబుచ్చే నేత చంద్రబాబు అని అన్నారు.   

మరిన్ని వార్తలు