గోదారి కెరటంలా ఉప్పొంగిన ‘యాత్ర’

28 May, 2022 02:27 IST|Sakshi
రాజమహేంద్రవరంలో జరిగిన సామాజిక న్యాయ భేరి సభకు హాజరైన అశేష జనవాహిని

రాజమహేంద్రవరం సామాజిక న్యాయభేరి సభకు అపూర్వ ఆదరణ

ప్రజల్లోకి 17 మంది  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రుల బృందం

ఇది సామాజిక మహా విప్లవం.. తరతరాల ఆవేదనను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీర్చారు

70 ఏళ్లలో బడుగు, బలహీన వర్గాలకు ఇంత ప్రాధాన్యం ఇప్పుడే

కేబినెట్‌లో 70 శాతం మంత్రి పదవులు ఇదే తొలిసారి

సంక్షేమం, సామాజిక న్యాయంపై చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: సామాజిక మహా విప్లవానికి నాంది పలికి రాజ్యాధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు వెన్నంటి నిలిచి కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచి సంక్షేమ పథకాలు అమలు కాకుండా అడ్డుపడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో అన్ని వర్గాలకూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేలు చేకూరుస్తుండటంతో విపక్షాల వెన్నులో వణుకుపుడుతోందని చెప్పారు. ‘సామాజిక న్యాయభేరి’ బస్సుయాత్ర’ రెండో రోజు శుక్రవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి చేరుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్‌లు ఇందులో పాల్గొన్నారు. మూడేళ్లలో సీఎం జగన్‌ తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన మార్పు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వివరించారు.

తరతరాల ఆవేదనను తీర్చారుధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ మంత్రి 
సామాజిక ఉద్యమం ఈ నాటిది కాదు. బ్రిటిష్‌ పాలన కంటే ముందు, వారి పాలనలోనూ, ఆ తర్వాత కూడా ఉంది. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం నాడు బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ప్రారంభించిన సామాజిక సంక్షేమ రథాన్ని సీఎం జగన్‌ పరుగులు తీయిస్తున్నారు. సామాజిక న్యాయాన్ని ఆచరణలో చేసి చూపారు. 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే ఉన్నారు. ఆయా వర్గాలకు 70 శాతం పదవులను సీఎం జగన్‌ కేటాయించారు. ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. వివిధ పథకాల ద్వారా నేరుగా బదిలీతో రూ.1.30 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాగా అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల వారు దాదాపు 82 శాతం ఉన్నారు. ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా, దళారుల ప్రమేయం లేకుండా, అర్హతే కొలమానంగా సంతృప్త స్థాయిలో పథకాలను అందచేస్తున్నారు.

మహానాడులో బాబు క్షమాపణ చెప్పాలి
చంద్రబాబు హయాంలో సర్వం జన్మభూమి కమిటీలకే అప్పగించడంతో అంతులేని అవినీతి, వివక్ష చోటు చేసుకుంది. నాడు ఏదైనా పథకం కావాలంటే ఇంటిమీద పచ్చ జెండా, ఒంటిపై పచ్చచొక్కా ధరించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులుండేవి. చివరకు కలెక్టర్లు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారు. అన్నీ మరిచిపోయిన చంద్రబాబు ఇప్పుడు బాదుడే బాదుడు అంటూ తిరుగుతున్నారు. చంద్రబాబు చేసిన తప్పులకు మహానాడులో క్షమాపణ చెప్పాలి. తాము అధికారంలోకి వస్తే కార్యకర్తలకు అన్నీ ఇస్తామంటూ మళ్లీ దోచుకుంటామని చెప్పకనే చెబుతున్నారు. చంద్రబాబు రాష్టమంతా పర్యటించినా జగన్‌ మూడేళ్ల పాలనలో ఒక్క తప్పును కూడా చూపలేకపోయారు. కరోనా మహమ్మారితో ప్రపంచమే అల్లకల్లోలమైనా ఏపీలో ఏ ఒక్క పథకమూ ఆగకుండా నిరుపేదలకు సాయం అందిందంటే సీఎం మానవత్వమే కారణం. నాడు అమృతం దొరికితే దేవతలు, రాక్షసులు పంచుకున్నారు. అదే తల్లితండ్రులకు దొరికితే పిల్లలకు ఇస్తారు.  చంద్రబాబుకు దొరికితే మాత్రం ఆయన కుటుంబానికి, ఆయన వర్గానికే పంచిపెడతారు. అదే జగన్‌కు దొరికితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి వారికి మేలు చేస్తారు. అందుకే మనమంతా జగన్‌నుŒ, పార్టీని రక్షించుకోవాలి.  

ఇది స్వర్ణయుగం: తానేటి వనిత, ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి  
అణగారిన వర్గాలంటే ఎంతో ఆప్యాయత ఉండటం వల్లే వరుసగా ఇద్దరు దళిత మహిళలకు కీలకమైన హోంశాఖను సీఎం జగన్‌ అప్పగించారు. రెండుసార్లు మంత్రివర్గంలో బడుగు, బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. రాజకీయ సాధికారత దిశగా ధృఢమైన నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్ని రాజకీయ పదవులు, నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. వాటిలో 50 శాతం మహిళలకు ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇది స్వర్ణయుగం. జనసేనకు సోషల్‌ మీడియా, ఎల్లోమీడియా తోడుంటే సీఎం జగన్‌కు ప్రజాబలం అండగా ఉంది.

అంబేడ్కర్‌ ఆశయాలు సాకారం:  మంత్రి పినిపే విశ్వరూప్‌ 
స్వాతంత్య్రానంతరం ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో సంక్షేమ పాలన కొనసాగుతోంది. సామాజిక న్యాయానికి వైఎస్‌ జగన్‌ మూడేళ్ల పాలన నిలువుటద్దం లాంటిదైతే చంద్రబాబు హయాం నీటిమూట లాంటింది. ఎస్సీ, మైనారిటీ వర్గాలకు బాబు మంత్రివర్గంలో కనీసం చోటు కల్పించలేదు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న అంబేడ్కర్‌ ఆశయాన్ని చేతల్లో చూపుతు¯న్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. పిల్లలకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెనతోపాటు విద్యాకానుక, వసతిదీవెన, అమ్మ ఒడి, గోరుముద్ద లాంటి పథకాలతో విద్యా వ్యవస్థలో డాక్టర్‌ అంబేడ్కర్‌ కోరుకున్నవన్నీ సాకారం చేశారు. ఇప్పటివరకు పార్లమెంటు మెట్లు ఎక్కని శెట్టిబలిజ, మత్స్యకారులకు జగన్‌ ఆ అవకాశం కల్పించారు. కేవలం ఓటర్లుగానే మిగిలిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు.

మహానాడు కాదు.. మాయనాడు: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ 
కుగ్రామమైన అడవిపాలెంలో జన్మించిన నన్ను మంత్రి స్థాయికి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే. జగనన్న అంటే భరోసా. అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. చంద్రబాబు మహానాడు ఒక మాయనాడుగా మారింది. ఇన్ని వర్గాలు ఒకే వేదికపై 
నిలవడం సామాజిక విప్లవానికి నాందిగా నిలుస్తోంది.

చరిత్ర సృష్టించారు: ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ 
బడుగు, బలహీనవర్గాలకు ఇంత పెద్ద ఎత్తున పదవులు కట్టబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాత్రమే. బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ అని నిరూపించి దేశంలోనే ఒక చరిత్ర సృష్టించారు.

 అత్యుత్తమ పాలన: చింతా అనురాధ, అమలాపురం ఎంపీ  
సీఎం జగన్‌ అత్యుత్తమ పరిపాలన అందిస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా సంక్షేమ పథకాలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. అట్టడుగు వర్గాలకు సముచిత స్థానం కల్పించిన తొలి సీఎం వైఎస్‌ జగన్‌. ఇవాళ దేశమంతా మన రాష్ట్రం వైపే చూస్తోంది. 

‘తూర్పు’న సామాజిక సంబరం...
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన సామాజిక న్యాయాన్ని వివరించేందుకు మంత్రుల బృందం చేపట్టిన బస్సు యాత్ర అపూర్వ ఆదరణతో కొనసాగుతోంది. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో దారి పొడవునా ఉప్పొంగే గోదారిలా ప్రజలు తరలివచ్చి ఆశీర్వదిస్తున్నారు. తుని నుంచి రాజమహేంద్రవరం లాలాచెరువు సెంటర్‌ వరకు అడుగడుగునా యాత్రపై పూల వర్షం కురిపించారు. ప్రత్తిపాడు, జగ్గంపేట, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సు యాత్రకు ఘన స్వాగతం లభించింది.

మండుటెండలోనూ..
శుక్రవారం మధ్యాహ్నం 2.37 గంటలకు కాకినాడ జిల్లా తునిలో తాండవ వంతెనకు చేరుకున్న యాత్ర అన్నవరం, కత్తిపూడి, చెందుర్తి,« ధర్మవరం, యర్రవరం, సోమవరం, కృష్ణవరం టోల్‌గేట్, బూరుగుపూడి, రామవరం, తాళ్లూరు, మల్లేపల్లి, గండేల్లి, మురారి, తూర్పుగొనగూడెం, దివాన్‌చెరువు మీదుగా రాజమహేంద్రవరం వరకు 110 కిలోమీటర్లు మేర సాగింది. జాతీయ రహదారి వెంట ఎండను సైతం లెక్కచేయకుండా బస్సుయాత్రను స్వాగతించారు. తుని నుంచి రాజమహేంద్రవరం వరకు చెన్నై–కోల్‌కత్తా జాతీయ రహదారి జనసంద్రమైంది.

పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు
యాత్రలో ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, అంజాద్‌బాషా, నారాయణస్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, «విడదల రజని, గుమ్మనూరి జయరాం, ఉషశ్రీచరణ్, మేరుగు నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, పీడిక రాజన్నదొర, ఆదిమూలపు సురేష్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, గొడ్డేటి మాధవి, సంజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, తలారి వెంకట్రావు, నాగులాపల్లి ధనలక్ష్మి, జి.శ్రీనివాసనాయుడు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, తోట త్రిమూర్తులు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌లు విప్పర్తి వేణుగోపాలరావు, కవురు శ్రీనివాసరావు, పలు కార్పొరేషన్ల చైర్మన్‌లు పాల్గొన్నారు. బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలకు, శ్రేణులకు పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా నేడు (శనివారం) నరసరావుపేటలో బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి నంద్యాలలో బస.  

   

మరిన్ని వార్తలు