ఆర్బీకేలు ఆధునిక దేవాలయాలు 

22 Sep, 2022 06:30 IST|Sakshi

శాసనసభలో ‘వ్యవసాయం–అనుబంధ రంగాలు’ పై స్వల్పకాలిక చర్చలో సభ్యుల ప్రశంసలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఆధునిక దేవాలయాలుగా మారాయని పలువురు ఎమ్మెల్యేలు అన్నారు. చంద్రబాబు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో రైతులకు భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు బుధవారం ‘వ్యవసాయం–అనుబంధ రంగాలు’ పై స్వల్పకాలిక చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. 

వ్యవసాయాన్ని పండుగ చేస్తాం 
జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను 
వ్యవసాయాన్ని పండుగ చేసేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది. డ్యాములు కళకళలాడుతున్నాయి. కరువు లేదు. చంద్రబాబు హయాంలో కరువు తప్ప ఇంకోటి లేదు. విత్తు దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు సీఎం జగన్‌ రైతుకు భరోసా ఇస్తున్నారు. విత్తనాలు, ఎరువుల్లో కల్తీని అరికట్టేందుకు అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మా ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపి మార్కెట్‌కంటే ఎక్కువ రేటుకే కల్లాల వద్దే ధాన్యం కొంటోంది. కోళ్ల పరిశ్రమ, ఆక్వా, సెరీకల్చర్‌ ఇలా అన్ని వ్యవసాయ అనుబంధ రంగాలను ఆదుకుంటోంది. 

వ్యవసాయం అంటే బాబుకు నిర్లక్ష్యం 
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి 
వ్యవసాయాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. నాడు వైఎస్సార్‌ వ్యవసాయానికి ఊపిరి పోస్తే.. ఆయన తనయుడిగా సీఎం జగన్‌ రైతులకు పెద్దపీట వేశారు. చంద్రబాబు హయాంలో విద్యుత్‌ బకాయిలు కట్టలేదని రైతులపై కేసులు పెట్టారు. ఎంతో మంది పల్లెలను వదిలి వలస వెళ్లిపోయారు. వారిని వైఎస్సార్‌ వెనక్కి తీసుకొచ్చి వ్యవసాయం చేయించారు. ఆయన ఆశయ సాధనకు సీఎం జగన్‌ రైతులపై రూపాయి భారం పడకుండా సంక్షేమాన్ని అందిస్తున్నారు. 30 ఏళ్ల పాటు ఆటంకం లేకుండా రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సాగును పెంచాలి. ప్రకృతి వ్యవసాయంపైనా దృష్టి సారించాం.

బాబు ఐదేళ్లలో ఒక్క గింజ కూడా కొనలేదు 
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి 
రైతును మోసం చేసే వాడు భూమిపై బతికి బట్టకట్టలేడు. ఆనాడు చంద్రబాబు రైతులను బషీర్‌బాగ్‌లో కాల్చి చంపారు. వ్యవసాయం దండగ అన్నారు. రుణమాఫీ పేరుతో మోసం చేశారు. అందువల్లే ఆయనకు ఈ దుర్గతి పట్టింది. సీఎం జగన్‌ మంచి చేస్తున్నారు కాబట్టే రాష్ట్రం సుభిక్షంగా ఉంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మా దగ్గర ఒక్క ధాన్యం గింజ కూడా కొనలేదు. ఇప్పుడు మా ప్రాంతంలో రైసు మిల్లులు లేకపోయినా ధాన్యం కొని, రాయదుర్గం నుంచి చిత్తూరుకు ప్రభుత్వమే తరలిస్తోంది. మా దగ్గర ఆదర్శ భారత కోఆపరేటివ్‌ సొసైటీలో ఎక్కువ లోన్లు ఇస్తున్నారు. వాటికి వడ్డీ రాయితీ రావట్లేదు. దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని కోఆపరేటివ్‌ సొసైటీలకు కూడా వడ్డీ రాయితీ వర్తింపజేయాలి.  

రైతుల సంక్షేమం ఆగదు 
మాజీ ఉప సభాపతి కోన రఘుపతి 
కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో రైతులకు సంక్షేమ పథకాలు ఆగలేదు. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఒక చరిత్ర. ఒక్క రూపాయికే పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధి కోసం రూ. 3 వేల కోట్లు ఇవ్వడం వంటివి రైతుల గురించి ఆలోచించే వారే చేస్తారు. కోవిడ్‌ సమయంలోనూ ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాం. చంద్రబాబు రూ.88 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి దగా చేశారు. మా సీఎం జగన్‌ రైతు భరోసాతో వ్యవసాయానికి ఊపిరి పోశారు. ఆర్బీకేల ద్వారా 98 శాతం పంట నమోదు, విక్రయం జరుగుతోంది. పక్క రాష్ట్రాల వారు వచ్చి మన ఆర్బీకేల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆర్బీకేలను బ్యాంకులతో అనుసంధానం చేసి రైతులకు ఆర్థిక సపోర్టును మరింత పెంచాలి. 

ఉచిత విద్యుత్‌ రైతులకు వరం 
చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా 
వైఎస్సార్‌ హయాంలోనే రైతుల స్వర్ణ యుగం ప్రారంభమైంది. వైఎస్సార్‌ తర్వాత రైతులను పట్టించుకున్న నాయకుడు సీఎం జగన్‌. రైతుల కోసం ఈ మూడేళ్లలో చరిత్రలో లేనన్ని పథకాలు తెచ్చారు. ఆర్బీకేలు ప్రతి గ్రామంలో ఆధునిక దేవాలయాలుగా మారాయి. పశువులకు అంబులెన్సులు వచ్చాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ సలహా మండళ్లు ఏరా>్పటు చేసి సాగులో మెళకువలు నేర్పుతున్నారు. గతంలో కంటే ఎక్కువ వ్యవసాయ రుణాలు ఇస్తున్నారు.  

మరిన్ని వార్తలు