Phirangipuram Lourdu Pakodi Story: నాడు ఫిరంగులకు..నేడు పకోడీలకు ప్రసిద్ధి

6 Nov, 2021 20:42 IST|Sakshi

యడ్లపాడు(గుంటూరు): హైదరాబాద్‌ బిర్యానీ.. రాజస్తానీ పానీపూరీ.. ఆత్రేయపురం పూతరేకులు.. కాకినాడ కాజ.. మచిలీపట్నం బందర్‌లడ్డు.. మందస కోవా.. గుంటూరు కారం.. ఇవన్నీ తయారు చేసే విధానం ఒకటే. పట్టణం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సైతం నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో తయారైన ఐటం ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. అందుకే ఆయా ప్రాంతాల పేరుతో అవి ప్రసిద్ధి చెందాయి. అలా ప్రసిద్ధి చెందిన స్నాక్‌ఐటంలలో ‘మసాలా పకోడి’ ఒకటి. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఫిరంగిపురం మసాలా పకోడి తయారీకి ప్రత్యేకమని చెప్పాలి. 

మసాలా ఐటమ్స్‌లో ‘మగధీర’
మనం మసాలా దోశ, మసాలా వడ, మసాలా ఇడ్లీ, ముంత మసాలా (పిడతకింద పప్పు) ఇలా మసాలాతో చేసే బ్రేక్‌ఫాస్టు, స్నాక్స్‌ అనేకం చూశాం.. తిన్నాం. ఆ కోవకు చెందినదే మసాల పకోడి. శనగపిండితో తయారు చేసే పకోడిలో మెత్త పకోడి, గట్టి పకోడి అని రెండు రకాలు ఎక్కువగా స్ట్రీట్‌ఫుడ్స్‌ బండ్లపై చూస్తుంటాం. తింటుంటాం. కాని మసాలా పకోడిలా ప్రత్యేకమైంది. కేవలం ఫిరంగిపురంలో మాత్రమే స్పెషల్‌గా లభించిన చోటా వీటిని తిన్నామంటే ఆ టేస్ట్‌కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. 

నాడు ఫిరంగులు..నేడు పకోడీలు తయారీ
అద్దంకి రెడ్డిరాజులు కొండవీడును రెండోరాజధానిగా చేసుకుని పాలించే క్రమంలో రాజ్య సంరక్షణకు అవసరమైన ఫిరంగులను తయారీ, రవాణా కేంద్రంగా వర్థిల్లిన ప్రాంతమే ఫిరంగిపురం. భారతస్వాతంత్య్రానికి ముందు నుంచే ఈ చారిత్రక ప్రాంతంలోనే మసాలా పకోడి విక్రయాలు చేయడం విశేషం. ప్రస్తుతం ఫిరంగిపురం రాష్ట్రీయ రహదారిపక్కనే ఉన్న దుకాణాల బజారును పకోడిలా సెంటర్‌గా పిలుస్తారు. 

మద్రాసు నుంచి వచ్చిన మసాలా పకోడి
మద్రాసు ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన మసాలా పకోడిని రాజమహేంద్రవరం నుంచి వలస వచ్చిన పెద్దకోట్ల లూర్థు ఇక్కడ వారికి తొలిసారిగా పరిచయం చేశారు. అప్పట్లో గారెలు, బజ్జీ, పకోడి వంటి బాండీ రకాలను కొద్దిమంది అమ్ముతున్నారు. స్థానికుల వద్దే అలవాటు పడ్డ కస్టమర్లు తనదుకాణానికి రావాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో అతని వద్ద పనిచేస్తున్న మద్రాసు వాసితో మసాలా పకోడిని తయారు చేయించడం ప్రారంభించాడు. కొత్త దుకాణం, కొత్త రుచి ఆనోటా ఈనోటా పాకి ఊళ్లోవారినే కాదు సమీప గ్రామాల ప్రజల్ని ఆకర్షించేలా చేసింది. దీంతో పది మంది పనివాళ్లతో చేసేస్థాయికి వ్యాపారం ఎదిగింది. 

ఐదుతరాలుగా అదే రుచి అందిస్తూ... 
1940లో లూర్థు ద్వారా ప్రారంభమైన ఈ మసాలా పకోడి నేటికీ ఆయన వంశీయులు తయారు చేసి విక్రయించడం జరుగుతుంది. కేవంల శనగపిండి, పచ్చిమిర్చి, ఉల్లి, వెల్లుల్లి, చెక్క, లవంగా, అల్లం వంటి ఆరు దినుసులతో మసాలా పకోడి తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఐదోతరం వారు ఇక్కడ మూడు దుకాణాలను పక్కపక్కనే ఏర్పాటు చేసుకున్నప్పటికీ అందరూ లూర్థు పకోడి పాత దుకాణం అంటూ పేరు పెట్టుకోవడం గమనార్హం. ఈ మూడు దుకాణాల్లో లూర్థు, బాలసురేంద్ర, అన్నదమ్ములు చెందిన పిల్లలే వీటిని తయారు చేసి విక్రయాలు చేస్తున్నారు. 

దేశవిదేశాలకు, రాజకీయ ప్రముఖులకు పరిచమైన పకోడి
లూర్థు మసాలా పకోడి దేశ రాజధాని ఢిల్లీ, బొంబాయి తదితర మహానగరాలకు వెళ్లడమే కాదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర మాజీ మంత్రులు సైతం గుంటూరు వాసులు అందించే ఊరగాయ పచ్చళ్లతో పాటు మసాలా పకోడి తీసుకెళ్లేవారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావుతో పాటు రాష్ట్రంలోని ఎందరో రాజకీయ, పారిశ్రామిక పెద్దలు వీటి రుచి చూసిన వారే. అంతేకాదు లాక్‌డౌన్‌కు ముందు వరకు ప్రతినెలా రెండుసార్లు అమెరికా, జపాన్‌లో ఉన్న మన తెలుగు వారు వీటిని కొరియర్‌లో తెప్పించుకోవడం పరిపాటి. సో ఈ సారి మీరెప్పుడైనా ఫిరంగిపురం వెళ్తే మసలా పకోడిని ఓ పట్టు పట్టండి.


 

మరిన్ని వార్తలు