వచ్చేవారంలోగా రిఫండ్స్‌ జరగాలి - ఆన్‌లైన్‌ ట్రావెల్‌ పోర్టల్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు

9 Nov, 2023 07:13 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో బుక్‌ చేసుకున్న విమాన టిక్కెట్లు, సర్వీసుల రద్దుకు సంబంధించిన రిఫండ్‌లను వచ్చే వారంలోగా (నవంబర్‌ 3 వారం లోపు) రిఫండ్‌ చేయాలని ఆన్‌లైన్‌ ట్రావెల్‌ పోర్టల్‌లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 25 నుండి వివిధ దశాల్లో దేశంలో లాక్‌డౌన్‌ అమలయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పలు విమాన సేవలను కూడా నిలిపివేయడం జరిగింది. అయితే అప్పటి ముందస్తు బుకింగ్‌ల విషయంలో కొందరికి రిఫండ్స్‌ జరగలేదు. కొన్ని సాంకేతిక, ఆర్థిక అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి.

ఈ అంశంపై ఆన్‌లైన్‌ ట్రావెల్‌ అగ్రిగేటర్లతో వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక సమావేశం జరిగింది. వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నవంబర్‌ మూడవవారంలోపు రిఫండ్స్‌ జరగాలని అగ్రిగేటర్లకు స్పష్టం చేసినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువరించింది. ప్రకటన ప్రకారం వినియోగదారుల ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. 

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ–వినియోగదారుల వ్యవహారాల శాఖ సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేసే విషయంలో విధివిధానాలు ఖరారుకు చేయాలని సమావేశం భావించింది.  వినియోగదారుల ఫిర్యాదుల సమర్థవంతమైన పరిష్కారం కోసం ఎయిర్‌ సేవా పోర్టల్‌తో జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌ను ఏకీకృతం చేయడం చర్చల్లో చోటుచేసుకున్న మరొక ప్రతిపాదన.

మరిన్ని వార్తలు