అంతరిస్తున్న ఆదిమానవుడు

6 Oct, 2021 13:16 IST|Sakshi

నల్లమలలో మిగిలిన తొలిమానవుడి ఆనవాలు

హారసేనకరణ దశ దాటలేని చెంచులు

ఆత్మకూరు రూరల్‌: హిరణ్యకశిపుడిని సంహరించడానికి ఉగ్ర నారసింహ అవతారమెత్తిన విష్ణుమూర్తి లోక భీకర  రౌద్రాన్ని తన అందచందాలతో హరించి ఆయన్ను వరిస్తుంది  చెంచులక్ష్మి. పురాణ కాలంలోనే మనకు ఇలా చెంచుల ప్రస్తావన కనిపిస్తుంది.మానవుడి ఆవిర్భావం ప్రస్తుతం ఆఫ్రికాగా పిలవబడే ప్రాంతంలో సంభవిస్తే భూమి ఖండాలుగా విడిపోయిన కాలంలో ఆఫ్రికాఖంఢపు దక్షిణ భాగంలో అతుక్కుని ఉన్న ప్రస్తుత భారత ఉప ఖండపు దక్షిణభాగం ద్వారా మానవుడి విస్తరణ ఆసియా ఖండానికి సాగిందని ఆంత్రపాలజిస్టులు  చెబుతున్నారు.


                          తన చంటి పిల్లలతో చెంచు మహిళ

అలా భారత దేశంలోకి విస్తరించిన తొలిమానవుడి ఆనవాలు తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అడవుల్లో ఆదిమ గిరిజన చెంచుల రూపంలో నిలిచి ఉంది.జన్యు పరివర్తనం జరగక పోవడంతో చెంచులలో రోగనిరోధక శక్తి నశించి వారి జీవన ప్రమాణం కనిష్ట స్థాయికి చేరుకుంది. చెంచితల్లో అసలే రక్తహీనత,అందులో బాల్యవివాహాల సంఖ్య ఎక్కువే ఈ కారణంతో ప్రతి ప్రసవం ఒక గండంగా గడుపుతు అకాల మరణాలకు గురవుతుంటారు. ఆదిమ గిరిజన లక్షణమైన మద్యపానం చెంచుల్లో ఆహారపు అలవాటుగా కొనసాగుతూ ప్రస్తుతం అది వ్యసన దశకు చేరి  చెంచుల మరణాల రేటును పెంచి వారి జాతి అంతరించేపోయే  దిశకు   తీసుకుపోతోంది.


                         దైనందిన జీవనంలో ఓ చెంచు కుటుంబం

చెంచుల ఆవాసప్రాంతం
ఆదిమ గిరిజన తెగకు చెందిన చెంచులు తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అడవుల్లో మాత్రమే నివసిస్తున్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పూర్వ మహబూబ్‌ నగర్,కర్నూలు,ప్రకాశం,గుంటూరు జిల్లాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో మాత్రమే వీరి ఉనికి ఉంది.


                      విల్లంబులతో చెంచు యువకుడు

 జీవనవిధానం
అడవుల్లోను , అడవి అంచుల్లో నివాసముండే చెంచులు ఒక ప్రత్యేకమైన డిజైన్‌లో కనిపించే గుండు గుడిసెల్లో నివాసముంటారు. ఆహార సేకరణ దశలోనే ఉన్న చెంచులు అడవుల్లో దొరికే చిన్నతరహా అటవి ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగిస్తారు.భుజాన గొడ్డలి, చేతిలో విల్లంబులు,ముందు నడుస్తు కుక్క,వెనుకనే అనుసరిస్తు భార్య ... ఇది సంప్రదాయ చెంచుకుటుంబం ఆహార సేకరణకు అడవిలోకి నడిచే దృశ్యం. ఉడుముల వంటి చిన్నపాటి జంతువులను వేటాడతారు.

                                చెంచుల బాల్యం

ఇపుడిపుడే ప్రభుత్వం ,ఆర్డిటి (రూరల్‌ డవలప్‌మెంట్‌ ట్రస్ట్‌) వంటి స్వఛ్ఛంధ సంస్థలు కట్టించి ఇస్తున్న ఇళ్లలో నివాసముంటున్నారు. మూఢ నమ్మకాల కారణంగా చెంచులు ఇళ్ళలో శయనించరు.గూడెం మధ్యలో ఏర్పాటు చేసుకున్న వెదురు మంచలపై పడుకుంటారు.అలాగే రాత్రిపూట మైధునం చెంచుల్లో నిషిద్దం. వారు ఆహారసేకరణకు అడవిలో సంచరించే టపుడు పగటి పూట మాత్రమే శృంగారంలో పాల్గొంటారు. చెంచులు అమిత సిగ్గరులు. మైదాన ప్రాంతీయులతో చాలా తక్కువగా మాట్లాడతారు.ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటారు.ఈ కారణంగానేమో రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరొనా భూతం చెంచుగూడేల్లోకి చొరబడ లేక పోయింది.ఆహార సేకరణ దశను దాటలేక పోతున్న చెంచులకు ఎంతగా ప్రయత్నించినా  వ్యవసాయం ఒంట పట్టడంలేదు. అందుకే చెంచుల పొలాలు గిరిజనేతరుల చేతుల్లోకి వెళుతున్నాయి.

                                చెంచు కుర్రాడి పనితనం    

కర్నూలు జిల్లాలో చెంచుల స్థితి
 కర్నూలు జిల్లాలో మొత్తం  12 మండలాల్లో 42 గూడేల్లో చెంచులు నివసిస్తున్నారు. వెలుగోడు పట్టణంలో 1, ఆత్మకూరులో1 ,పాణ్యం మండలంలో 1,చెంచు గూడెం మినహా అన్ని చెంచు గూడేలు అన్ని నల్లమల అడవుల్లోనో, అటవీ సమీప ప్రాంతంలోనో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో 2133 చెంచు కుటుంబాలు ఉండగా అందులో 4138 మంది పురుషులు,4022 మంది స్త్రీలు కలిపి మొత్తం జనాభా  8,160 గా ఉన్నారు.

                  చెంచుల సాంప్రదాయ నివాసం గుండు గుడిసెలు

పలుచనవుతున్నచెంచుగూడేలు
చెంచుగూడేల్లో నానాటికి వారి జనాభా తగ్గిపోతు అంతరించి పోయే దశకు చేరుకుంటోంది.ఉదాహరణకు 40ఏళ్ళ కిందట ఆత్మకూరు అటవి డివిజన్‌లోని పసురుట్ల, రుద్రకోడు చెంచు గూడేలను తరలించి సమీప గ్రామమైన నల్లకాల్వ సమీపంలో పునరావాసం కల్పించారు.నాడు రెండు గూడేలు కలసి 120కి పైగా చెంచులు నల్లకాల్వ చేరారు. ఇపుడు వారి సంఖ్య 35కు మించి లేక పోవడం విషాదం.2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో 8,160 గా కనిపిస్తున్న చెంచుల జనాభా ఇప్పడు తీయబోయే గణాంకాలలో ఎంత పడిపోయేది అర్థం కాని స్థితి ఉంది.అంతరించి పోయే దశలో ఉన్న పులుల సంరక్షణ కోసం పటిష్ట మైన చట్టాలు,చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అంతరించ బోతున్న ఒక ఆదిమ మానవ జాతి రక్షణ కోసం యుద్దప్రాతిపదికన  రంగంలోకి దిగాల్సి ఉంది.


                    మాడపు గింజలు కాల్చుకు తింటున్న చెంచులు

చెంచుల కోసం హేమన్‌ డార్ఫ్‌ కృషి
చెంచుల స్థితిగతులపై ఒక నివేదికను కోరుతూ నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం హేమన్‌ డార్ఫ్‌ అనే విశేషజ్ఞుడిని నియమించింది. ఆయన అప్పట్లో నిజాం తెలంగాణాలోను ఆంధ్ర ప్రదేశ్‌లోను అనేక ఆదిమ గిరిజన తెగలపై పరిశోధనలు జరిపారు.ఆయన ఇచ్చి నివేదిక సారాంశం తోనే అటు నిజాం నవాబు, ఇటు బ్రిటిష్‌ ప్రభుత్వము నల్లమల అడవులను చెంచుల (అభయారణ్యం)రిజర్వ్‌గా ప్రకటించింది.వారి సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు చేశారు. కాని నేడు నల్లమల అంతా పులుల అభయారణ్యంగా మారడం అడవి బిడ్డలైన చెంచులను అడవిని వదలి వెళ్ళాలనే ఒత్తిడికి గురవుతుండడం నేటి విషాదం.

                        కుక్క తోడు ఆదిమ గిరిజన లక్షణం

చెంచుల అభివృధ్ధి కోసం ప్రత్యేక ప్రభుత్వ ఏజెన్సీలు
చెంచులను అభివృధ్ధి పథంలో తీసుకు వచ్చేందుకు సమీకృతగిరిజనాభి వృధ్ధి సంస్థను శ్రీశైలంలో ఏర్పాటు చేశారు.ఈ ఏజెన్సీ కార్యాచరణలో చెంచుల అభివృధ్ధి కోసం పలు ప్రణాళికలు రచించినా అవి వారిని ఉన్నదశనుంచి మరొ దశకు తీసుకు పోలేని స్థితి నెలకొంది. విద్య, వైద్య రంగాలలో కృషిఅంతంత మాత్రంగానే ఉంది.జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకం చెంచుల ఆకలి తీర్చే వరప్రదాయినిగా ఉంటోంది. అయితే ఈ కార్యక్రమంలో పని కల్పించడంలో అధికారులు అలసత్వం చూపుతారనే విమర్శ ఉంది.


                          పెచ్చెర్వు చెంచు గూడెం

ఆదర్శ గిరిజన గ్రామంగా బైర్లూటి
ఆత్మకూరు మండల పరిధిలో ఉన్న బైర్లూటి చెంచు గిరిజన గ్రామాన్ని రాష్ట్రప్రభుత్వం ఆదర్శ గ్రామంగా ప్రకటించింది. ఈ ప్రకటణలో ఆంతర్యం గ్రామాన్ని ఆదర్శగ్రామంగా చేయాలని.సకల మౌళిక వసతుల కల్పన ఈ పథకపు ఉద్దేశంగా కనపడుతోంది.రాష్ట్రంలో ఇలా ఆదర్శగ్రామంగా ప్రకటించ బడిన ఆదిమ గిరిజన గ్రామం బైర్లూటి ఒక్కటే కావడం విశేషం.

మరిన్ని వార్తలు