చిన్నారుల ఆరోగ్యానికి ఎంతో మేలు

22 Mar, 2023 02:28 IST|Sakshi
● కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ ● రాగిజావ పంపిణీ ప్రారంభం ● హాజరైన ఎమ్మెల్యేలు కోన, కరణం

బాపట్ల: ప్రభుత్వం పంపిణీ చేసే రాగిజావ చిన్నారుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని జిల్లా కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ అన్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా బడిపిల్లలకు రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. విద్యార్థులనుద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్నిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, బాపట్ల, చీరాల శాసనసభ్యులు కోన రఘుపతి, కరణం బలరామకృష్ణ్ణమూర్తి, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డిలతో కలసి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులకు రాగిజావను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి పి.వి.రామారావు, డిప్యూటీ డీఈఓ జి.వెంకటేశ్వర్లు, ఎంఈఓ నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

చదువులు మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల స్థాయిని మెరుగుపరచడానికి ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తుందని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ చెప్పారు. విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని ఆమె వివరించారు. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. అధికపోషకాలున్న రాగిజావ పంపిణీ ఎంతో మంచి కార్యక్రమం అన్నారు. ముఖ్యంగా బాలికల్లో రక్తహీనత నివారణకు దోహదపడుతుందన్నారు. జిల్లాలో 1421 పాఠశాలల్లో లక్షా 8 వేల 314 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. రోజుమార్చి రోజున రాగిజావ పంపిణీకి ప్రభుత్వం ప్రతి నెలా రూ.2.8 కోట్ల నిధులు వెచ్చించనుందన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు