అంజని పుత్ర.. అభయ ప్రదాత

26 Mar, 2024 02:05 IST|Sakshi
రథాన్ని లాగుతున్న ఎంపీ సురేష్‌, అసెంబ్లీ అభ్యర్థి చిన హనిమిరెడ్డి

అద్దంకి/అద్దంకి రూరల్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి, కొండపైనున్న లక్ష్మీనరసింహస్వామి 69వ వార్షిక తిరునాళ్ల మంగళవారం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివార్లను దర్శించుకున్నారు. ఉదయం నుంచే క్షేత్రం కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాలు విద్యుత్‌ బల్బులతో కాంతులీనాయి. ఏసీ సుభద్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిబ్బంది సహకారంతో భక్తులకు అసౌకర్యం కలుగకుండా, ఉచిత దర్శనంతో పాటు, వీఐపీ, వికలాంగులకు ప్రత్యేక దర్శన క్యూలైన్లను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో భక్తులకు మజ్జిగ, మంచినీరుతో పాటు, దర్శనం చేసుకున్న భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేశారు. పలు బ్యాంక్‌ బ్రాంచ్‌లు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీటిని ఉచితంగా పంపిణీ చేశారు.

ప్రత్యేక పూజలు

ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి, చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌ , ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మహిళలు స్వామికి చక్కెర పొంగలి వండి, కుండలను నెత్తిన పెట్టుకుని దర్శనంతో మొక్కులు తీర్చుకున్నారు. కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దేవదాయశాఖ ఈవో కోటిరెడ్డి ఆధ్వర్యంలో కల్యాణం, సామూహిక వ్రతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ప్రత్యేక బస్సులు

అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి 30 ప్రత్యేక బస్సులను నడిపారు. వీటితోపాటు జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, ఒంగోలు, దర్శి, పొదిలి తోపాటు వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపారు. కొండమీద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భవిష్య పాఠశాలకు చెందిన రెండు బస్సుల్లో భక్తులను ఉచితంగా చేరవేశారు. దత్తపాదుకా క్షేత్ర ఆధ్వర్యంలో దద్దోజనం పంపిణీ చేశారు.

ఆకర్షణీయంగా దుకాణాలు

తిరునాళ్లు సందర్భంగా క్షేత్రానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన బొమ్మలు, చెరుకు విక్రయ దుకాణాలు ఆకర్షణీయంగా నిలిచాయి. వివిధ వస్తువులతో నిర్వహించిన సంతల్లో భక్తులు వస్తువులను కొనుగోలు చేశారు. తిరునాళ్లలో ఏర్పాటు చేసిన జైంట్‌ వీల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.

500 మంది పోలీసులతో బందోబస్తు

శింగరకొండ తిరునాళ్లలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నలుగురు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 50 మంది సీఐలు, 100 మంది ఏఎస్‌ఐలు, 334 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. తిరునాళ్ల ఇన్‌చార్జిగా చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్‌ వ్యవహరించారు. సీఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌కు సమస్య తలెత్తకుండా మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం అడ్డ రోడ్డు, మేదరమెట్ల పైలాన్‌ వద్ద భారీ వాహనాలను దారి మళ్లించారు. 99 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ సమీపంలో వాహనాలకు ఉచిత పార్కింగ్‌ వసతి కల్పించారు.

అంగరంగ వైభవంగా రథోత్సవం

శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో వరుసగా నాలుగో సంవత్సరం రథోత్సవాన్ని సోమవారం ఏసీ సుభ్రద ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా నిర్వహించారు. రథంపై ఉత్సవ మూర్తులను ఉంచి, కేరళ వాయిద్యాలతో దేవస్థానం నాలుగువైపులా వీధుల్లో ఊరేగించారు. రథం ముందు వివిధ దేవతామూర్తుల వేషధారణల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జై వీరాంజనేయ అంటూ భక్తులు నినాదాలు చేస్తూ భక్తి పారవశ్యంతో రథాన్ని లాగారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా శింగరకొండ తిరునాళ్ల ప్రసన్నాంజనేయ, లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలకు పోటెత్తిన భక్తులు వివిధ శాఖల స్టాల్స్‌ ఏర్పాటుతో సందడి మజ్జిగ, మంచినీరు, ఉచిత లడ్డూ, పులిహోరను పంపిణీ చేసిన దాతలు

Election 2024

మరిన్ని వార్తలు