24/7 అందుబాటులో ఎన్నికల కంట్రోలు రూమ్‌ | Sakshi
Sakshi News home page

24/7 అందుబాటులో ఎన్నికల కంట్రోలు రూమ్‌

Published Thu, Apr 11 2024 8:45 AM

ఎన్నికల కంట్రోల్‌ రూములను పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి పి.రంజిత్‌బాషా  - Sakshi

జిల్లా ఎన్నికల అధికారి రంజిత్‌బాషా

బాపట్ల: ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ 24 గంటల పాటు సమర్థంగా పని చేసేలా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా ఆదేశించారు. ఎంసీసీ, సీ–విజిల్‌ కంట్రోల్‌ రూమ్‌, మీడియా కోఆర్డినేషన్‌ మోనిటరింగ్‌ కమిటీ సెల్‌, సోషల్‌ మీడియా సెల్‌, వెబ్‌ క్యాస్టింగ్‌, ఎన్నికల గ్రీవెన్‌న్స్‌ సెల్‌ కంట్రోల్‌ రూమ్‌, 1950 హెల్ప్‌ లైన్‌ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా, జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ కలసి బుధవారం పరిశీలించారు. పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి నూతనంగా ఏర్పాటు చేసిన వీడియో సమావేశ మందిరం, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు వినియోగించే వాహనాలకు ఏర్పాటు చేసిన జీపీఎస్‌ ట్రాకింగ్‌ పనితీరును తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ లు, వెబ్‌ క్యాస్టింగ్‌ పనితీరుపై ఆరా తీశారు. సువిధ యాప్‌లో అనుమతుల కొరకు వచ్చిన దరఖాస్తులు, ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేశారు. కోడ్‌ ఉల్లంఘించే అంశాలపై కంట్రోల్‌ రూమ్‌ లోని నోడల్‌ అధికారులు నిశిత పరిశీలన చేయాలని ఆదేశించారు. ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్న నేపథ్యంలో వ్యవసాయ కళాశాలలోని అతిథి గృహం, ఆర్‌ అండ్‌ బి అతిథి గృహాలను ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ కలిసి పరిశీలించారు.

ఈవీఎం, వీవీ ప్యాడ్స్‌ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తాం

బాపట్ల: ఈవీఎం, వీవీ పాడ్స్‌ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ రాజకీయ పార్టీల సమక్షంలో ఈనెల 12వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. బాపట్ల సెగ్మెంట్‌ కింద అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలకు ఈవీఎం, వీవీ పాడ్స్‌ యంత్రాల కేటాయింపులు ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. ఆన్‌ లైన్‌ ద్వారా అత్యంత పారదర్శకతతో ఈ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఎన్నికల రోజున ఓటు వేయడానికి వచ్చే పౌరులు ఓటరు గుర్తింపు కార్డు తమ వెంట తెచ్చుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రంజిత్‌ బాషా చెప్పారు. ఓటర్‌ కార్డు లేకపోయినప్పటికీ ఓటు వేసే వెసులుబాటు ఎన్నికల కమిషన్‌ కల్పించిందన్నారు. ఈసీఐ ధ్రువీకరించిన 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తున్నట్లు వివరించారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్‌.సత్తిబాబు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

అనుమానాస్పద లావాదేవీలపై

నివేదికలు ఇవ్వాలి

బాపట్ల: బ్యాంకుల నుంచి అనుమానాస్పద నగదు లావాదేవీలపై బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా ఆదేశించారు. బ్యాంకు అధికారుల సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. నామినేషన్‌ వేసే అభ్యర్థులు కొత్తగా బ్యాంకు ఖాతా తెరవడానికి బ్యాంకు అధికారులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతాను వినియోగించాలనే నిబంధనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. జిల్లాలోని 256 బ్యాంకు బ్రాంచ్‌ల లావాదేవీలపై నిఘా ఉందన్నారు. మైక్రో అబ్జర్వర్లకు త్వరలోనే ప్రత్యేక శిక్షణలు ఇస్తామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్‌.సత్తిబాబు, ఎల్‌.డి.ఎం.శివకృష్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement