TS Election 2023: అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..

23 Oct, 2023 12:15 IST|Sakshi

భద్రాచలం, ఇల్లెందు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..

ఇల్లెందు నుంచి రవీంద్రనాయక్‌, భద్రాచలానికి ధర్మా..

సాక్షి, భద్రాద్రి: భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో జిల్లా నుంచి ఇల్లెందు, భద్రాచలం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ సీనియర్‌ నాయకుడిగా ఉన్న ధారావత్‌ రవీంద్రనాయక్‌కు ఇల్లెందు టికెట్‌ దక్కింది. స్థానిక నేతలతో పాటు పలు ప్రాంతాలకు చెందిన 18 మంది దరఖాస్తు చేసుకోగా బంజారాల గాంధీగా పేరున్న రవీంద్రనాయక్‌ను ఎంపిక చేశారు. రవీంద్రనాయక్‌ రెండు దఫాలు ఎమ్మెల్యేగా, ఒకసారి రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా పని చేశారు.

1998లో ఖమ్మం లోక్‌సభ స్థానానికి పోటీ చేయడంతో రవీంద్రనాయక్‌కు ఉమ్మడి జిల్లాతో అనుబంధం ఏర్పడింది. బంజారాలను ఎస్టీ జాబితాలో కలిపేందుకు పోరాడిన నేతగా, ఉన్నత విద్యావంతుడిగా రవీంద్రనాయక్‌కు పేరుంది. అయితే ఆయన స్థానికేతరుడు కావడం ప్రతికూల అంశంగా చెప్పుకుంటున్నారు. ఇల్లెందు నుంచి మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య, గుగులోత్‌ రాంచందర్‌ నాయక్‌, హతీరాం నాయక్‌, పూన్యానాయక్‌, సురేందర్‌ నాయక్‌ బీజేపీ టికెట్‌ ఆశించారు. వీరందరినీ పక్కన పెట్టి స్థానికేతరుడైన రవీంద్రనాయక్‌కు కేటాయించడం గమనార్హం.

రవీంద్రనాయక్‌ బయోడేటా..
ప్రస్తుత జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయికుంటలో 1952 ఆగస్టు 15న రవీంద్రనాయక్‌ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు డీటీ నాయక్‌ – జానకీబాయి. భార్య నందానాయక్‌ కాగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. 1972 – 76 మధ్య కాలంలో తెలంగాణ లంబాడా – ఎరుకుల యూత్‌ స్టూడెంట్‌ కమిటీ చైర్మన్‌గా పని చేశారు.

1978లో నల్లగొండ జిల్లా దేవరకొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 1983లో మరోసారి దేవరకొండ నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989 నుంచి 92 వరకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా పని చేశారు. 1998లో బీజేపీ అభ్యర్థిగా ఖమ్మం లోక్‌సభ స్థానానికి పోటీ చేసి 1.20 లక్షల ఓట్లు సాధించారు. 2004లో వరంగల్‌ ఎంపీగా ఎన్నికయ్యారు.

భద్రాచలం అభ్యర్థిగా ధర్మా..
భద్రాచలం బీజేపీ అభ్యర్థిగా కుంజా ధర్మాకు టికెట్‌ కేటాయించారు. గతంలో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మా భార్య కుంజా సత్యవతి ఇటీవల మృతి చెందగా, ప్రస్తుతం ధర్మాను అభ్యర్థిగా ప్రకటించారు. ఇంటర్‌ వరకు చదివిన ధర్మా 2008 వరకు సీపీఎంలో కీలక నేతగా పని చేశారు.

2009లో భార్య సత్యవతితో కలిసి కాంగ్రెస్‌లో చేరి పలు పదవులు చేపట్టారు. 2010 నుంచి 2012 వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా పని చేసి, 2012లో కాంగ్రెస్‌లో చేరి రెండేళ్ల పాటు డీసీసీ సభ్యుడిగా, 2014–17వరకు భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. 2017లో బీజేపీలో చేరిన ధర్మా కొద్దిరోజులు జిల్లా ఉపాధ్యక్షుడిగా, ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌గా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు