8 మందే ప్రయాణికులు.. విమానం దిగమని కోరిన సంస్థ

21 Nov, 2023 16:58 IST|Sakshi

విమానం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులను దించేసిన సంఘటన బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లోని ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నుంచి చెన్నైకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు ఎక్కారు. అయితే వారిని మరో విమానంలో ఎక్కిస్తామని హామీ ఇచ్చారు. దాంతో సదరు ప్రయాణికులు దిగిపోయారు. కేవలం ఎనిమిది మందితో ప్రయాణించేందుకు ఇండిగో నిరాకరించినట్లు తర్వాత ప్రయాణికులు గ్రహించినట్లు తెలిసింది.

ఇండిగో విమానం 6E 478 ఆదివారం సాయంత్రం అమృత్‌సర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి బయలుదేరింది. అయితే ఎనిమిది ప్రయాణికులు మినహా ఇతర ప్రయాణికులు బెంగళూరులోనే దిగిపోయారు. విమానంలో కేవలం ఎనిమిది మందే ఉండడంతో వారిని వేరే విమానంలో చెన్నై పంపిస్తామని కోరాగా వారు దిగిపోయారు. అయితే కేవలం 8 మందితో ప్రయాణించేందుకు ఇండిగో నిరాకరించిందని తెలిసింది. దాంతో ఆదివారం రాత్రి బెంగళూరులోనే ఉండి సోమవారం వెళ్లాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. తమ ప్రయాణానికి అడ్డంకి ఏర్పడినప్పటికీ విమానయాన సంస్థ వారి బసకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు.

‘నవంబర్ 19, 2023 రోజున ఫ్లైట్ 6E 478 అమృత్‌సర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నై బయలుదేరింది. అమృత్‌సర్ నుంచి వచ్చే మరో ఎయిర్‌క్రాఫ్ట్ ఆలస్యం అయింది. దాంతో ఈ ఎనిమిది మంది చెన్నైకి వెళ్లే విమానం ఎక్కలేకపోయారు. ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ ప్రయాణికులకు సహాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. రాత్రిపూట వసతితో పాటు తదుపరి విమానంలో ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. కానీ కొందరు ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఉండాలనుకున్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’అని ఇండిగో ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు