ఎంఎస్‌ఎంఈల్లో ఆశాభావం

5 Jan, 2023 04:30 IST|Sakshi

2023లో లాభాలు పెరుగుతాయి

96 శాతం సంస్థల అభిప్రాయం

ఆర్థిక వృద్ధి, వినియోగంపై ఆశాభావం

ముంబై: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎంఎస్‌ఎంఈ) ఈ ఏడాది పట్ల ఎంతో సానుకూలత కనిపిస్తోంది. లాభాలు పెరుగుతాయని 96 శాతం అభిప్రాయపడుతున్నాయి. ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి నియో గ్రోత్‌ అనే సంస్థ వ్యాపార విశ్వాస అధ్యయనాన్ని నిర్వహించింది. దీనికి సంబంధించి వివరాలు విడుదల చేసింది. ఎంఎస్‌ఎంఈలకు నియోగ్రోత్‌ రుణాలు అందిస్తుంటుంది. దేశవ్యాప్తంగా 3,000 ఎంఎస్‌ఎంఈల యజమానుల నుంచి ఈ సర్వేలో భాగంగా అభిప్రాయాలను తెలుసుకుంది.

25 పట్టణాల పరిధిలో, 70కు పైగా వ్యాపార విభాగాల్లో ఈ సంస్థలు పనిచేస్తున్నాయి. తమ వృద్ధి పట్ల, లాభదాయకత పట్ల ఎంఎస్‌ఎంఈల్లో వ్యాపార విశ్వాసం వ్యక్తం కావడం సానుకూలమని నియోగ్రోత్‌ సీఈవో, ఎండీ అరుణ్‌ నయ్యర్‌ పేర్కొన్నారు. బలమైన డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ ఉండడం ఈ ఏడాది ఎంఎస్‌ఎంఈ రుణ పంపిణీకి మంచి ప్రేరణగా పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలు రుణ సాయంతో తమ వ్యాపారాలను విస్తరింకోవడానికి సుముఖంగా ఉన్నాయని చెప్పారు. భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి చేరువ అవుతున్న క్రమంలో 2023 సంవత్సరం ఎంఎస్‌ఎంఈలకు ఎంతో కీలకమని, ఇవి ముఖ్య పాత్ర పోషించగలవని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ఎంఎస్‌ఎంఈ రంగం ఆశాభావంతో ఉండడం ప్రోత్సాహకర సంకేతంగా నియోగ్రోత్‌ పేర్కొంది.  

వృద్ధిపై ఆశావహం
సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురు ఎంఎస్‌ఎంఈ ప్రతినిధుల్లో ముగ్గురు (75 శాతం) దేశ ఆర్థిక వృద్ధి పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. 20 శాతం మంది తటస్థ అభిప్రాయంతో ఉంటే, 5 శాతం మంది మాత్రమే ప్రతికూల అంచనాలతో ఉన్నారు. తయారీ, సేవల రంగాల్లో పనిచేస్తున్న 80 శాతం మహిళా ఎంస్‌ఎంఈలు (మహిళల ఆధ్వర్యంలో నడిచేవి) దేశ ఆర్థిక వృద్ధి పట్ల సానుకూలంగా ఉన్నాయి.  

వినియోగ డిమాండ్‌  
75 శాతం ఎంఎస్‌ఎంఈలు వినియోగ డిమాండ్‌ ఈ ఏడాది పెరుగుతుందన్న అంచనాతో ఉన్నాయి. 21 శాతం ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు ప్రస్తుతం మాదిరే డిమాండ్‌ కొనసాగుతుందని భావిస్తుంటే, డిమాండ్‌ తగ్గుతుందన్న అభిప్రాయం 4 శాతం ఎంఎస్‌ఎంఈ ప్రతినిధుల నుంచి వ్యక్తమైంది. అత్యధికంగా చెన్నైకు చెందిన 86 శాతం ఎంఎస్‌ఎంఈలు, హైదరాబాద్‌కు చెందిన 83 శాతం, ముంబై నుంచి 81 శాతం ఎంఎస్‌ఎంఈలు వినియోగంపై ఆశాభావంతో ఉన్నాయి. రిటైల్‌ వాణిజ్యంలోని ఎంఎస్‌ఎంఈలు ఈ ఏడాది బలమైన డిమాండ్‌ పట్ల సానుకూలంగా ఉన్నాయి. అలాగే, మహిళల ఆధ్వర్యంలో టోకు వాణిజ్యంలో పనిచేసే ఎంఎస్‌ఎంఈల్లోనూ ఇదే మాదిరి అభిప్రాయం వ్యక్తమైంది.   

వ్యాపార లాభదాయకత
96 శాతం ఎంఎస్‌ఎంఈలు ఈ ఏడాది తమ వ్యాపా ర లాభాలు వృద్ధి చెందుతాయని భావిస్తున్నాయి. ఇలా భావించే వాటిల్లో 66 శాతం తమ లాభాలు 30 శాతం మేర పెరుగుతాయని అంచనాతో ఉన్నా యి. 30 శాతం ఎంఎస్‌ఎంఈలు తమ లాభాల్లో వృద్ధి 30 శాతం లోపు ఉండొచ్చని, 4 శాతం ఎంఎస్‌ఎంఈలు లాభాలు తగ్గుతాయని భావిస్తున్నాయి. చెన్నై నుంచి అత్యధికంగా 80 శాతం ఎంఎస్‌ఎంఈలు లాభాలు 30 శాతానికి పైనే పెరుగుతాయనే అంచనాను వ్యక్తం చేశాయి. ముంబై, పుణె నగరాల్లో పనిచేసే ఎంఎస్‌ఎంఈలు కొంత రక్షణాత్మక అంచనాతో ఉన్నాయి.  

రుణ డిమాండ్‌  
మెట్రోయేతర పట్టణాల్లోని 84 శాతం ఎంఎస్‌ఎంఈలు వ్యాపార రుణాలను తీసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాయి. ఎంఎస్‌ఎంఈల వ్యాపారం కోలుకుంటుండడంతో, మూలధన అవసరాలు, వృద్ధి, విస్తరణకు రుణాలు అవసరం పడనున్నాయి. తయారీ, సేవల రంగాల్లోని 80 శాతం మహిళా ఎంఎస్‌ఎంఈలు వ్యాపార రుణాలను తీసుకోవచ్చని చె ప్పాయి. 60 శాతం ఎంఎస్‌ఎంఈలు డిజిటల్‌ టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టనున్నట్టు, డిజిటల్‌ టెక్నా లజీని అందిపుచ్చుకునేందుకు సముఖంగా ఉన్నట్టు చెప్పాయి. 61 శాతం ఎంఎస్‌ఎంఈ అధినేతలు త మ సిబ్బంది సంఖ్యను పెంచుకోనున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు