స్మాల్‌ సేవింగ్స్‌ స్కీంలో .. ఆధార్‌, పాన్‌ తప్పని సరి!

1 Apr, 2023 17:10 IST|Sakshi

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. దీంతో కేంద్రం తెచ్చిన నిర్ణయాలు అమలు కానున్నాయి. ఇప్పటికే ఆధార్ - పాన్ లింక్‌ గడువును కేంద్రం పెంచింది. అయితే తాజాగా ఆధార్‌ - పాన్‌  విషయంలో మరో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ పీపీఎఫ్‌, సుకన్య సమృద్ది యోజన, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌, పోస్టాఫీస్‌ సేవింగ్‌ స్కీమ్‌ వంటి చిన్న పొదుపు పథకాల్లో (small saving schemes) పాన్‌కార్డ్‌, ఆధార్‌ కార్డులను తప్పని సరిచేస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 31,2023న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో స్మాల్‌ సేవింగ్స్‌ స్కీంలో పెట్టుబడులు పెట్టేందుకు కేవైసీ తప్పని సరి చేసింది. దీంతో పాటు నిర్దిష్ట థ్రెషోల్డ్ కంటే ఎక్కువ పెట్టుబడిపై పాన్ కార్డును అందించాలని సూచించింది. 

చిన్న పొదుపు పథకాల్లో కొత్త నిబంధనలు
కేంద్ర ఆర్ధిక శాఖ నోటిఫికేషన్‌ ప్రకారం.. చిన్న పొదుపు పథకాల్లోని చందాదారులు సెప్టెంబర్‌ 30,2023లోగా ఆధార్‌ నెంబర్‌ ను జతచేయాలని తెలిపింది. కొత్తగా పథకాల్లో చేరిన చందాదారులు 6 నెలల్లోగా ఆధార్‌ను లింక్‌ చేయాలని సూచించింది. ఒక వేళ స్మాల్‌ సేవింగ్స్‌ స్కీంలో కొత్తగా చేరిన వారి 6 నెలల్లోగా ఆధార్‌ను అందించాలని లేదంటే అక్టోబర్‌ 1, 2013 నుంచి సదరు అకౌంట్లు పనిచేయడం ఆగిపోతాయని వెల్లడించింది. 

పాన్‌ కార్డ్‌సైతం
చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు తెరిచే సమయంలో పాన్‌కార్డ్‌ని సమర్పించాలి. ఆ సమయంలో సాధ్యం కాకపోతే రెండు నెలల్లో పాన్‌ కార్డ్‌ను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలి. ఇక ఆ అకౌంట్‌లలో రూ.50 వేల కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఒక ఖాతాలో అన్ని క్రెడిట్స్‌ రూ.లక్ష దాటినప్పుడు, ఒక నెలలో ఖాతా ట్రాన్సాక్షన్‌ల లావాదేవీలు రూ.10 వేలు దాటితే.. పాన్‌ను సమర్పించాలి. లేదంటే పాన్‌ అప్‌డేట్‌ చేసే వరకు సదరు ఖాతాలు స్తంభించిపోనున్నాయి.  

చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. పాన్‌ - ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌!

మరిన్ని వార్తలు