బెంగళూరులో యాక్సెంచర్ ఏఐ స్టూడియో.. ఏంటిది.. ఏం చేస్తుంది?

20 Dec, 2023 13:55 IST|Sakshi

Accenture Generative AI Studio: ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్‌ బెంగళూరులో జెనరేటివ్‌ ఏఐ స్టూడియోను ఏర్పాటు చేసింది. దాదాపు రూ.25 వేల కోట్ల పెట్టుబడిలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ జెనరేటివ్‌ ఏఐ స్టూడియో ఉద్దేశం, ఉపయోగం, అందించే సేవలు వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

ప్రస్తుతం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం గురించి తెలిసిందే. అన్ని రంగాల వ్యాపారాలు ఈ టెక్నాలజీ వినియోగంపై ఆసక్తి కనబరుస్తున్నాయి. దీన్ని అందిపుచ్చుకునేందుకు ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్‌ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. రాబోయే మూడేళ్లలో ఏఐ, డేటా ప్రాక్టీస్‌లో 3 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.25 వేల కోట్లు)  పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన కొన్ని నెలల తర్వాత, డిసెంబర్ 18న యాక్సెంచర్ భారత్‌లోని బెంగళూరులో జనరేటివ్ ఏఐ స్టూడియోను ప్రారంభించింది.

  • ఉత్పాదక కృత్రిమ మేధ (Generative AI) ఆధారంగా పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి క్సెంచర్ డేటా, ఏఐ బృందం క్లయింట్‌లతో కలిసి పని చేసేందుకు ఓ చోటును కల్పించడమే ప్రాథమికంగా ఈ స్టూడియో ఉద్దేశం. ఏఐ ఆధారిత పరిష్కారాలతో సంస్థలు తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది.
  • జనరేటివ్ ఏఐ అనేది ఒక రకమైన కృత్రిమ మేధస్సు. ఇది శిక్షణ డేటాను పోలి ఉండే కొత్త డేటాను రూపొందించగలదు. వ్యాపార ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతోంది. యాక్సెంచర్‌లోని గ్లోబల్ లీడ్- డేటా & ఏఐ సెంథిల్ రమణి ప్రకారం.. మొత్తం వాల్యూ చైన్‌లోని సామర్థ్యాలకు ప్రాధాన్యతనిస్తూ తమ ఏఐ పెట్టుబడులను పెంచుకోవడానికి  ఈ స్టుడియో సహాయపడుతుంది.
  • ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లో పెరిగిన పెట్టుబడి విస్తృత ధోరణిని యాక్సెంచర్‌ ఏఐ స్టుడియో ప్రతిబింబిస్తుంది. యాక్సెంచర్ నిర్వహించిన ఇటీవలి సర్వేలో 74 శాతం C-సూట్ (ఉన్నత కార్యవర్గాలు) 2024లో తమ ఏఐ సంబంధిత వ్యయాన్ని పెంచాలని యోచిస్తున్నట్లు తెలిపారు.  ఇది అంతకుముందు సంవత్సరంలో 50 శాతమే ఉండేది.

అందించే సేవలు
స్టూడియో ఉత్పాదక ఏఐకి సంబంధించిన అనేక రకాల సేవలను అందిస్తుంది. వీటిలో యాజమాన్య ఉత్పాదకకేఐ మోడల్ “స్విచ్‌బోర్డ్,” అనుకూలీకరణ పద్ధతులు, మోడల్ మేనేజ్డ్‌​ సేవలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయి. క్లయింట్‌లకు ఉత్పాదక ఏఐ పరిష్కారాలను అర్థం చేసుకోవడం, ప్రయోగం చేయడం, స్వీకరించడం, పెంచుకోవడంలో సహాయపడేలా ఈ సేవలను రూపొందించినట్లు యాక్సెంచర్‌ పేర్కొంటోంది.

>
మరిన్ని వార్తలు