Artificial Intelligence: ఏఐతో మరో కొత్త ఆందోళన!

19 Dec, 2023 11:51 IST|Sakshi

ఈ ఏడాది ప్రారంభం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.  గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఇటీవలే తమ సొంత ఏఐ చాట్‌బాట్‌లను ప్రవేశపెట్టాయి. ఇవి మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నేడు కోట్లాది మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ సంవత్సరం ఏఐ నూతన సాంకేతిక అభివృద్ధి ఫలాలను మనకు అందించింది.

ఇటీవల గూగుల్ ‘జెమిని’ని ప్రవేశపెట్టింది. ఇది పలు బెంచ్‌మార్క్ పరీక్షలలో చాట్‌ జీపీటీని ఓడించింది. అయితే కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చిన ఒక రిపోర్టు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏఐ స్వయంగా తన టూల్స్‌ను తానే సృష్టించుకోగలదని తేలింది. మనిషి అవసరం లేకండానే ఈ ప్రక్రియ జరుగుతందని వెల్లడయ్యింది.

బిజినెస్ ఇన్‌సైడర్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం ఎంఐటీ, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తల బృందం ఏజిప్‌ (ఏజెడ్‌ఐపి) అనే ఏఐ టెక్ కంపెనీతో జతకట్టింది. ఈ నేపధ్యంలో నిపుణులు చిన్నపాటి ఏఐ సైడ్‌కిక్‌లను సొంతంగా రూపొందించడానికి పెద్ద ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా కోడ్‌ను ఛేదించారు. దీంతో ఏఐ స్వయంగా తన టూల్స్‌ను తయారు చేసుకుంటోంది. 

ఈ సందర్బంగా అజిప్‌ కంపెనీ సీఈఓ మీడియాతో మాట్లాడుతూ చాట్‌ జీపీటీని వినియోగిస్తున్న మెగా ఏఐ  మోడళ్లు వాటికవే చిన్న ఏఐ టూల్స్‌ను సృష్టిస్తాయని తెలిపారు. ఏఐ టూల్స్‌ స్వీయ అభివృద్ధిలో ఇది మొదటి అడుగు అని అన్నారు. ఇది ఎంత అద్భుతమో అంత ప్రమాదకరం కూడా కావచ్చన్నారు. అయితే ఏఐ చేతికి వీటి నియంత్రణ ఇవ్వడం సరైనది కాదని భావిస్తున్నామన్నారు. గూగుల్‌లో అందుబాటులో ఉన్న డేటాను ఏఐ స్వయంగా ఎలా ఉపయోగిస్తుందినే దానిపై అనేక సందేహాలున్నాయన్నారు. ఈ విధమైన ఏఐ అభివృద్ధిపై కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: 10 ‘సుప్రీం’ తీర్పులు.. 2023లో భవితకు దిశానిర్దేశం!

>
మరిన్ని వార్తలు