ఎయిర్‌టెల్‌ భారీ ప్లాన్‌: రూ.28,000 కోట్ల పెట్టుబడి, టార్గెట్‌ అదే!

29 Dec, 2022 11:33 IST|Sakshi

న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతి ఎయిర్‌టెల్‌ రూ.27–28 వేల కోట్ల పెట్టుబడి వ్యయం చేయనున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా 5జీ నెట్‌వర్క్‌ విస్తరణ లక్ష్యంగా ఈ పెట్టుబడి ఉంటుంది. మొబైల్‌ యాంటెన్నాలు, ఫైబర్, బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్‌ప్రైస్‌ టెక్నాలజీ డేటా సెంటర్స్‌పై ఈ ఖర్చు చేస్తారు. ‘ఎయిర్‌టెల్‌ మూలధన వ్యయం గత మూడేళ్లలో ఖర్చు చేసిన దానికి అనుగుణంగా ఉంటుంది.

5జీ వేగవంతమైన రోల్‌అవుట్‌ కారణంగా ఇది హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఏడాదిలో ఈ వ్యయంలో పెరుగుదలను చూడవచ్చు. క్రమంగా అదే స్థాయిలో కొనసాగవచ్చు’ అని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నవంబర్‌ 26 నాటికి కంపెనీ 5జీ నెట్‌వర్క్‌ కోసం 3,293 బేస్‌ స్టేషన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్‌ సేవల ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారి వెల్లడించారు. మార్కెట్‌ పరిస్థితులనుబట్టి ధరల శ్రేణి ఆధారపడి ఉంటుందని అన్నారు.  

అధిక చార్జీలు ఉండవు..
హరియాణా, ఒడిషాలో కనీస రిచార్జ్‌ విలువ 28 రోజుల కాలపరిమితి గల ప్యాక్‌పై 57 శాతం ధర పెంచి రూ.155గా కంపెనీ నిర్ణయించింది. ఈ పైలట్‌ ప్యాక్‌ కింద అన్‌లిమిటెడ్‌ కాలింగ్, 1 జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లను ఆఫర్‌ చేస్తోంది. పైలట్‌ ప్రాజెక్ట్‌పై ఆరు వారాల్లో కంపెనీ ఒక అవగాహనకు రానుంది. తదనుగుణంగా ఇతర టెలికం సర్కిల్స్‌లో ఈ ప్యాక్‌ను ప్రవేశపెడతారు. ప్రపంచంలో 5జీకి ప్రీమియం చార్జీలు విజయవంతం కాలేదని కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

అధిక చార్జీలు వసూలు చేసే ఆలోచన లేదన్నారు. 2జీ నుంచి 4జీకి మళ్లడం, ప్రీ పెయిడ్‌ నుంచి పోస్ట్‌ పెయిడ్, పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదార్లు బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్‌ వంటివి కొనుగోలు కారణంగా ఒక్కో కస్టమర్‌ నుంచి సగటు ఆదాయం అధికం అవుతుందన్నారు. జూలై–సెప్టెంబర్‌లో వినియోగదారు నుంచి ఎయిర్‌టెల్‌కు సమకూరిన సగటు ఆదాయం రూ.190. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.153 నమోదైంది.

చదవండి: MNCs Quitting India: భారత్‌ను వదిలి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు.. కారణం అదే!

మరిన్ని వార్తలు