On-time Performance: ఆన్‌టైమ్‌లో బెస్ట్‌.. ఆకాశ ఎయిర్‌

15 Dec, 2023 16:47 IST|Sakshi

తరచూ ఫ్లైట్‌ ఎక్కే ప్రయాణికులు విమానాల ఆలస్యం, రద్దు వంటి సమస్యలతో ఎప్పుడోసారి ఇబ్బందులు పడే ఉంటారు. ఇలాంటి సమస్యలు అన్ని ఎయిర్‌లైన్స్‌లోనూ ఉంటాయి. అయితే దేశంలోని ఏయే విమానయాన సంస్థలో ఇలాంటి సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయనే దానిపై పౌర విమానయాన సంస్థ తాజాగా గణాంకాలు విడుదల చేసింది. 

సమయ పనితీరు (ఆన్‌టైమ్‌ పర్ఫార్మెన్స్‌- OTP) మెరుగ్గా ఉన్న ఎయిర్‌లైన్స్‌ జాబితాలో ఆకాశ ఎయిర్‌ (Akasa Air) అగ్రస్థానంలో ఉంది.  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2023 నవంబర్ నెలలో ఆకాశ ఎయిర్‌ సమయ పనితీరు 78.2 శాతం వద్ద ఉంది. ఇండిగో సంస్థ 77.5 శాతంతో రెండవ స్థానంలో నిలిచింది. 72.8 శాతం ఓటీపీతో విస్తారా మూడవ స్థానంలో ఉండగా స్పైస్‌జెట్ 41.8 శాతంతో ఆధ్వాన సమయ పనితీరును నమోదు చేసింది. ఇక అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా 62.5 శాతంతో రెండో అధ్వాన ఆన్‌టైమ్‌ పర్ఫార్మెన్స్‌ ఎయిర్‌లైన్‌గా నిలిచింది. 

ఫ్లై బిగ్.. రద్దుల్లో అత్యధికం
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాలలో నమోదైన వివరాల ఆధారంగా దేశీయ విమానయాన సంస్థల ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్‌ను లెక్కించారు. ఇక నవంబర్‌లో దేశీయ విమానయాన సంస్థల మొత్తం సరాసరి రద్దు రేటు 0.73 శాతంగా ఉంది. ఇందులో ఫ్లై బిగ్ అత్యధికంగా 7.64 శాతం రద్దు రేటును నమోదు చేయగా ఎయిర్ ఇండియా రద్దు రేటు అత్యల్పంగా 0.10 శాతంగా నమోదైంది. ఇండిగో విమానాల రద్దు రేటు 0.90 శాతంగా ఉంది.

ఈ ఏడాది నవంబరులో దేశీయ విమానయాన సంస్థలకు సంబంధించి ప్రయాణికుల నుంచి మొత్తం 601 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదు రేటు ప్రతి 10,000 మంది ప్రయాణికులకు సుమారు 0.47గా ఉంది. ఇండియావన్ ఎయిర్‌పై అత్యధికంగా ప్రతి వెయ్యి మంది ప్రయాణికులకు 99.1 ఫిర్యాదులు చొప్పున నమోదయ్యాయి. ఇక విస్తారా, ఇండిగో సంస్థలు వరుసగా 0, 0.1 ఫిర్యాదు రేట్లు నమోదు చేశాయి.

>
మరిన్ని వార్తలు