సెకండరీ మార్కెట్లోనూ అస్బా

22 Sep, 2022 06:14 IST|Sakshi

సెబీ చైర్‌పర్శన్‌ మాధవీ పురీ బచ్‌ వెల్లడి

ముంబై: సెకండరీ మార్కెట్‌ లావాదేవీల్లోనూ ఏఎస్‌బీఏ(అస్బా) తరహా సౌకర్యాలకు తెరతీసే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్‌ మాధవీ పురీ బచ్‌ తాజాగా పేర్కొన్నారు. ప్రైమరీ మార్కెట్‌కు ఇదెంతో ప్రయోజనకారిగా ఉన్నప్పుడు సెకండరీ మార్కెట్లోనూ ఎందుకు ప్రవేశపెట్టకూడదంటూ ప్రశ్నించారు.

అప్లికేషన్‌కు మద్దతుగా బ్యాంక్‌ ఖాతాలో ఇన్వెస్టర్‌ సొమ్ము తాత్కాలిక నిలుపుదల చేసే అస్బా తరహా సౌకర్యాలను సెకండరీ మార్కెట్లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌కు హాజరైన మాధవీ పురీ వెల్లడించారు. అస్బాలో భాగంగా ఐపీవోకు దరఖాస్తు చేసే ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు జరిగాకే సొమ్ము బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అయ్యే సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెకండరీ మార్కెట్‌ లావాదేవీల్లో ఇన్వెస్టర్ల సొమ్ము బ్రోకర్లవద్ద ఉంటున్నదని, అస్బా తరహా సౌకర్యముంటే ఇందుకు తెరపడుతుందని తెలియజేశారు.

లోపాలకు చెక్‌
సెకండరీ మార్కెట్లో వ్యవస్థాగత లోపాలను తగ్గించే లక్ష్యంతో అస్బా ఆలోచనకు తెరతీసినట్లు మాధవీ పురీ వెల్లడించారు. ఫిన్‌టెక్‌ సంస్థలను తమ వ్యాపార విధానాల(బిజినెస్‌ మోడల్‌)లో ఇలాంటి వాటికి తావీయకుండా చూడాలంటూ ఈ సందర్భంగా సూచించారు. లోపాలకు ఆస్కారమిస్తే నియంత్రణ సంస్థల చర్యలకు లోనుకావలసి వస్తుందని హెచ్చరించారు. ఆడిటెడ్‌ లేదా వేలిడేటెడ్‌కాని బ్లాక్‌ బాక్స్‌తరహా బిజినెస్‌ మోడళ్లను అనుమతించబోమంటూ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు