ఆరేళ్ల గరిష్టానికి పీ–నోట్‌ పెట్టుబడులు

28 Oct, 2023 05:26 IST|Sakshi

రూ.1.33 లక్షల కోట్లకు చేరిక

ఆకర్షిస్తున్న భారత్‌ వృద్ధి 

ఇక ముందూ సానుకూలమేనని అంచనా

న్యూఢిల్లీ: దేశ క్యాపిటల్‌ మార్కెట్లలో పార్టిసిపేటరీ నోట్స్‌ (పీ–నోట్లు) రూపంలో పెట్టుబడులు ఆరేళ్ల గరిష్టానికి చేరాయి. సెపె్టంబర్‌ చివరికి ఇవి రూ.1.33 లక్షల కోట్లకు పెరిగాయి. వరుసగా ఏడో నెలలోనూ వృద్ధి చెందాయి. 2017 జూలై తర్వాత పీనోట్‌ పెట్టుబడులు గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. నాడు ఇవి రూ.1.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. సెబీ గణాంకాలను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిశాయి.

సెబీ వద్ద నమోదు చేసుకోకపోయినా, పీ నోట్‌ ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల భారత క్యాపిటల్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పీ–నోట్లను సెబీ వద్ద నమోదు చేసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) జారీ చేస్తారు. పీ–నోట్ల ద్వారా ఈక్విటీ, డెట్, హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లో చేసిన పెట్టుబడులు సెప్టెంబర్‌ ఆఖరుకి రూ.1,33,284 కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ.1.22 లక్షల కోట్లు ఈక్విటీల్లో ఉండగా, డెట్‌లో రూ.10,688 కోట్లు, హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లో రూ.389 కోట్ల చొప్పున ఉన్నాయి.

జూలై చివరికి ఇవి రూ.1.23 లక్షల కోట్లు, జూన్‌ చివరికి రూ.1.13 లక్షల కోట్లు, మే చివరికి రూ.1.04 లక్షల కోట్లు, ఏప్రిల్‌ చివరికి రూ.95,911 కోట్ల చొప్పున ఉన్నాయి. పీ నోట్‌ పెట్టుబడులు సాధారణంగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల సరళినే అనుసరిస్తుంటాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుండడం పీ–నోట్‌ పెట్టుబడుల్లో వృద్ధికి దారితీస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా సెబీ వద్ద నమోదు చేసుకోకుండా ఇన్వెస్ట్‌ చేసుకునే సౌలభ్యం ఉండడం కూడా సానుకూలిస్తున్నట్టు చెబుతున్నారు. రానున్న సంవత్సరాల్లోనూ పీనోట్‌ పెట్టుబడుల రాక కొనసాగుతుందన్న అంచనా వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు