బ్యాంకు చిన్నదే.. కానీ టార్గెట్‌ పెద్దది!

16 Dec, 2023 22:28 IST|Sakshi

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో విలీనవుతున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1 లక్ష కోట్ల డిపాజిట్లతో సంవత్సరాన్ని ముగించాలని భావిస్తోంది. జైపూర్‌ కేంద్రంగా ఉన్న ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించి 2027 నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా 2027 మార్చి నాటికి రూ. 2 లక్షల కోట్ల డిపాజిట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంకు వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ పేర్కొన్నారు.

ఎప్పటిలాగే రిటైల్‌ రుణాలు కొనసాగిస్తూనే భవిష్యత్తులో యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు 2023 సెప్టెంబర్ నాటికి రూ. 75,000 కోట్లకు పైగా డిపాజిట్లను కలిగి ఉంది. ఇక ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు వద్ద రూ. 10,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. తాము 28-30 శాతం స్థిరమైన వృద్ధితో ఎదిగామని, ఇదే వృద్ధితో కొనసాగితే 2027 నాటికి డిపాజిట్లను రూ. 2 లక్షల కోట్లకు పెంచుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఏడేళ్లలో రూ.లక్ష కోట్ల డిపాజిట్లను సాధించడం ఏ బ్యాంకుకు అయినా వేగవంతమైన వృద్ధిరేటు అవుతుందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ బ్యాంకుల మాదిరిగా కాకుండా తాము ఆస్తి విభాగంలో ఇతర బ్యాంకుల కంటే ప్రధానంగా ఎన్‌బీఎఫ్‌సీలతో పోటీ పడుతున్నామని, కానీ డిపాజిట్ల విషయానికి వస్తే తాము అన్ని బ్యాంకులతో పోటీ పడతామని వివరించారు.

>
మరిన్ని వార్తలు