ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు శుభవార్త!

16 Dec, 2023 09:30 IST|Sakshi

న్యూ ఇయర్‌కి ముందే ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జీతాల పెంపుపై ఐదు నెలలుగా వాయిదా వేస్తూ వచ్చిన ఇన్ఫోసిస్‌ తాజాగా జీతాల పెంపుపై స్పష్టత ఇచ్చింది. త్వరలో శాలరీలను హైక్‌ చేస్తున్నట్లు తెలిపింది. పెరిగిన జీతాలు నవంబర్‌ 1 నుంచి అమలు అవుతాయని వెల్లడించింది.  

అయితే శాలరీ పెంపు ఉద్యోగులందరికి వర్తించదని స్పష్టం చేసింది. 2021 అక్టోబర్ తర్వాత జూనియర్ స్థాయిలో సంస్థలో చేరిన ఉద్యోగులకు, అదేవిధంగా 2021 అక్టోబర్ తర్వాత చేరిన మేనేజర్ స్థాయి సిబ్బందికి శాలరీ పెంపు జాబితాలో చోటు దక్కలేదు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 60 శాతం మంది ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉండగా.. ఈ పెంపు 7 శాతం నుంచి 10 మధ్యలో ఉంటుందని సమాచారం.  

మిగిలిన ఐటీ కంపెనీల పరిస్థితి ఇది
సాధారణంగా, ఐటి కంపెనీలు ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై) వేతనాల్ని పెంచుతాయి. ఏప్రిల్ 1 నుండి పెరిగిన శాలరీ అమల్లోకి వస్తుంది. అయితే, ఈ ఏడాది దాదాపు అన్ని ఐటీ కంపెనీలు ఆ సమయంలో వేతనాల పెంపును వాయిదా వేశాయి.

విప్రో
మరో టెక్‌ కంపెనీ విప్రో ఉద్యోగుల జీతాల్ని పెంచుతుండగా.. వారిలో ఇప్పటికే ఎక్కువ జీతాలు తీసుకుంటున్న వారికి కాకుండా.. పనితీరు బాగుండి, తక్కువ వేతనం తీసుకుంటున్న సిబ్బంది జీతాలు పెంపు ఉంటుందంటూ నివేదికలు హైలెట్‌ చేశాయి. 

హెచ్‌సీఎల్‌ 
జీతాల పెంపు విషయంలో రెండు సార్లు వాయిదా వేసిన హెచ్‌సీఎల్‌ ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరంలో సీనియర్ ఉద్యోగులకు శాలరీ హైకుల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
 
యాక్సెంచర్‌ సైతం 
అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్ కూడా ఈ ఏడాది భారత్, శ్రీలంకలోని తమ ఉద్యోగులందరికి శాలరీ పెంపు ఉండదని కేవలం కీలక విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఉంటుందని, స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆర్ధిక మాద్యం భయాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఫలితంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ప్రమోషన్లు, రివార్డుల విషయంలో సంస్థ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

>
మరిన్ని వార్తలు