బిట్‌కాయిన్‌ @ 66,901 డాలర్లు

21 Oct, 2021 06:00 IST|Sakshi

కొత్త ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి

న్యూయార్క్‌: కొన్నాళ్ల క్రితమే 30,000 డాలర్ల కిందికి పడిపోయిన బిట్‌కాయిన్‌ విలువ మళ్లీ దూసుకుపోతోంది. తాజాగా బుధవారం ఆల్‌ టైమ్‌ రికార్డు స్థాయి 66,901 డాలర్లకు (దాదాపు రూ. 50,17,575) ఎగసింది.  గతంలో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 64,889 డాలర్లు. ఈ ఏడాది వేసవిలో బిట్‌కాయిన్‌ విలువ 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రోషేర్స్‌ బిట్‌కాయిన్‌ స్ట్రాటెజీ వంటి బిట్‌కాయిన్‌ ఆధారిత ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తుండటం కాయిన్‌ ర్యాలీకి దోహదపడుతోంది.

లిస్టింగ్‌ రోజునే ప్రోషేర్స్‌ బిట్‌కాయిన్‌ ఈటీఎఫ్‌కి సంబంధించి 2.41 కోట్ల షేర్లు చేతులు మారటం బిట్‌కాయిన్‌ డిమాండ్‌కి నిదర్శనం. ఈ ఈటిఎఫ్‌లు నేరుగా బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్‌ చేయకుండా, దానికి సంబంధించిన ఫ్యూచర్స్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. ఈటీఎఫ్‌ల వల్ల.. హాట్, కోల్డ్‌ వాలెట్లు వంటి సాంకేతిక అంశాల బాదరబందీ లేకపోవడంతో సామాన్య ఇన్వెస్టర్లు కూడా బిట్‌కాయిన్‌ వైపు మొగ్గు చూపుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణ బ్రోకరేజి అకౌంటుతో కూడా బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి వీలవుతోందని పేర్కొన్నాయి. 

మరిన్ని వార్తలు