Canada-India relations: కెనడా పెట్టుబడులు ఎక్కువే

23 Sep, 2023 04:52 IST|Sakshi

ఎఫ్‌డీఐల రాకలో 17వ ర్యాంకు

మూడేళ్లలో రూ. 30,212 కోట్లు

స్టార్టప్‌లలో పెన్షన్‌ ప్లాన్‌కు వాటాలు

న్యూఢిల్లీ: ఇటీవల కెనడా, భారత్‌ మధ్య దౌత్య సంబంధ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో పెట్టుబడుల రాకపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలలో వెనువెంటనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడకపోవచ్చని ఇన్వెస్టర్ల ఫోరమ్‌.. సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ) పేర్కొంది. రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) వంటి అంశాలు పెద్దగా ప్రభావితం కాకపోవచ్చని అభిప్రాయపడింది.

నిజానికి 2000 ఏప్రిల్‌ నుంచి 2023 మార్చి మధ్య కాలంలో కెనడా నుంచి దేశీయంగా 3.64 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 30,212 కోట్లు) ఎఫ్‌డీఐలు ప్రవహించాయి. వెరసి ఎఫ్‌డీఐల రాకలో కెనడా 17వ ర్యాంకులో నిలిచినట్లు ఇన్వెస్ట్‌ ఇండియా పేర్కొంది. కెనడియన్‌ పెట్టుబడుల్లో సరీ్వసులు, మౌలికసదుపాయాల పెట్టుబడులు 40.63 శాతంకాగా.. దేశీయంగా 600కుపైగా కంపెనీలు కార్యకలాపాలు కలిగి ఉన్నాయి.

ఇంతకంటే అధికస్థాయిలో కెనడా కంపెనీలు దేశీయంగా పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జీటీఆర్‌ఐ నివేదిక ప్రకారం కెనడియన్‌ పెన్షన్‌ ఫండ్స్‌ 2022 చివరికల్లా దేశీయంగా 45 బిలియన్‌ డాలర్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. తద్వారా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఎఫ్‌డీఐగా కెనడా నిలిచింది. ఫండ్‌ పెట్టుబడుల్లో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ సర్వీసులున్నాయి. భారీ మార్కెట్‌ కావడం, పెట్టుబడులపై అత్యధిక రిటర్నులు కారణంగా కెనడా పెన్షన్‌ ఫండ్స్‌ దేశీయంగా పెట్టుబడులను కొనసాగించనున్నట్లు జీటీఆర్‌ఐ అభిప్రాయపడింది.  

లక్ష కోట్లకుపైగా
దేశీయంగా రియలీ్ట, ఎనర్జీ, హెల్త్‌కేర్, ఐటీ తదితర రంగాలలో కెనడియన్‌ పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌(సీపీపీఐబీ) లక్ష కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసింది.  సీపీపీఐబీ తాజా గణాంకాల ప్రకారం ఏడాదిక్రితంవరకూ దేశంలో 21 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇది ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ స్వతంత్ర బోర్డు నిర్వహణలో ఉంటుందని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ చైర్మన్‌ లక్ష్మీ నారాయణన్‌ పేర్కొన్నారు.

ప్రధానంగా వాటాదారులకు లబ్ది చేకూర్చే లక్ష్యంతో ఇన్వెస్ట్‌ చేస్తుందని తెలియజేశారు. దేశీ స్టార్టప్‌లలో సీపీపీఐబీ పెట్టుబడులు చేపడుతోంది. డెల్హివరీలో 6 శాతం, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో 2.68 శాతం, జొమాటోలో 2.42 శాతం, ఇండస్‌టవర్‌లో 2.18 శాతం, పేటీఎమ్‌లో 1.76 శాతం, నైకాలో 1.47 శాతం చొప్పున వాటాలు కలిగి ఉంది. ఈ బాటలో విదేశాలలో లిస్టయిన దేశీ కంపెనీలలోనూ ఇన్వెస్ట్‌ చేసింది. యూఎస్‌ లిస్టెడ్‌ విప్రో, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకులలో పెట్టుబడులు కలిగి ఉంది. మరికొన్ని ఇతర అన్‌లిస్టెడ్‌ కంపెనీలోనూ వాటాలు పొందినట్లు నారాయణన్‌ తెలియజేశారు.    

రెండింటికీ మేలే
భారత్, కెనడా సంబంధాలు రెండింటి లబ్ది ఆధారితమై ఉన్నట్లు స్వతంత్ర రీసెర్చర్, కన్సల్టెంట్‌ ప్రతీమ్‌ రంజన్‌ బోస్‌ పేర్కొన్నారు. దీంతో పెట్టుబడులపై వెనువెంటనే ప్రతికూల ప్రభావం పడకపోవచ్చని అంచనా వేశారు. రెండు ఆర్థిక వ్యవస్థలకూ నష్టదాయకం కావడంతో ప్రస్తుత వివాదాలు కొనసాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దౌత్య మార్గంలో సమస్యలు సర్దుకునే అవకాశమున్నట్లు తెలియజేశారు. దశాబ్దకాలం తదుపరి ఇటీవలే రెండు దేశాల మధ్య విదేశీ వాణిజ్య ఒప్పంద చర్చలకు తెరతీసినట్లు తెలియజేశారు. అయితే రాజకీయ వివాదాలు తలెత్తడంతో తిరిగి నిలిచిపోయినట్లు తెలియజేశారు. 2022లో కెనడాకు తొమ్మిదో ర్యాంకు విదేశీ వాణిజ్య భాగస్వామిగా భారత్‌ నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అధిక రిటర్నులు
దౌత్యపరమైన ప్రస్తుత ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య పెట్టుబడులను దెబ్బతీయకపోవచ్చని ప్రభుత్వ అత్యున్నత అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.  దేశీయంగా అత్యధిక రిటర్నులు లభిస్తుండటంతో కెనడియన్‌ పెన్షన్‌ ఫండ్స్‌ మౌలిక సదుపాయాల రంగంలో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు తెలియజేశారు. అధిక లాభాలను పొందుతున్నందునే దేశీయంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి ప్రస్తుత పరిస్థితుల కారణంగా పెట్టుబడులు వెనక్కి మళ్లేందుకు కారణాలు కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే వివాదాలు పరిష్కారంకావచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఫండ్స్‌ పెట్టుబడులపై ప్రపంచంలో మరెక్కడా ఈ స్థాయి రిటర్నులు పొందలేకపోవచ్చని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు