చైనాకు షాక్‌.. భారత్‌ నుంచి తైవాన్‌కు వేలాది కార్మికులు!

10 Nov, 2023 21:18 IST|Sakshi

చైనాకు గట్టి షాక్‌ ఇచ్చే పని చేస్తోంది భారత్‌. పక్కనే ఉన్న తైవాన్‌ దేశానికి వేలాది మంది కార్మికులను పంపనుంది. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య వచ్చే నెలలో కార్మిక ఒప్పందం జరగనుందని తెలిసింది. 

తైవాన్‌ తమ దేశంలోని ఫ్యాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలు, హాస్పిటళ్లలో పనిచేసేందుకు లక్ష మంది దాకా భారత్‌కు చెందిన వర్కర్లను నియమించుకోనుంది. ఎంప్లాయిమెంట్‌ మొబిలిటీ అగ్రిమెంట్‌పై డిసెంబర్‌లో భారత్‌, తైవాన్‌లు సంతకాలు చేస్తాయని భావిస్తున్నారు.

తైవాన్‌లో వయసు పైబడినవారి జనాభా పెరిగిపోయింది. ఫలితంగా  పనిచేసే సామర్థ్యం ఉన్న యువతకు అక్కడ కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అవరోధం ఏర్పడింది. అదే సమయంలో భారత్‌లో దీనికి విరుద్ధ పరిస్థితి నెలకొంది. దేశంలో యువత జనాభా పుష్కలంగా ఉంది. లేబర్‌ మార్కెట్‌లోకి ఏటా లక్షలాది మంది నిరుద్యోగులు వచ్చి చేరుతున్నారు. 

అయితే ఈ ఉపాధి ఒప్పందం చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులను రాజేసే అవకాశం ఉంది. ఎందుకంటే తైవాన్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నా చైనాకు నచ్చదు. తైవాన్‌ స్వతంత్ర ప్రాంతంగా ఉన్నప్పటికీ అది తమ దేశంలో అంతర్భాగమే అని చైనా వాదిస్తోంది.

ధ్రువీకరించిన అధికారి
భారత్‌-తైవాన్‌ ఉపాధి ఒప్పందానికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ మీడియాకు తెలియజేశారు. అయితే తైవాన్‌ కార్మిక శాఖ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. తమ దేశానికి కార్మిక సహకారం అందిస్తే స్వాగతిస్తామని బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థకు చెప్పింది. కాగా భారత్‌ ఇప్పటి వరకు జపాన్, ఫ్రాన్స్, యూకే సహా 13 దేశాలతో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంది. నెదర్లాండ్స్, గ్రీస్, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌లతోనూ ఇదే విధమైన ఏర్పాట్లపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు