ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..

23 Sep, 2023 04:54 IST|Sakshi

ప్రైవేటు ఆస్పత్రిలో కుమార్తె వైద్యం బిల్లు కట్టలేకపోయిన తల్లిదండ్రులు

సాక్షి కథనంతో తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ చొరవ

తల్లిదండ్రుల చెంతకు పాప

సైదాబాద్‌: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలే­సి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సెల్‌ అథా­రిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది.

తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్‌బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కు­తోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చే­శారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది.

దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్‌ సెల్‌ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు