ప్రధాని జస్టిన్‌ ట్రూడో కఠిన నిర్ణయం.. విదేశీ విద్యార్ధులకు భారీ షాకిచ్చిన కెనడా!

8 Dec, 2023 18:35 IST|Sakshi

జీవన వ్యయం పెరిగిపోతున్న తరుణంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల నుంచి కెనడాలో చదువుకునేందుకు వచ్చే విద్యార్ధుల డిపాజిట్‌ మొత్తాన్ని భారీగా పెంచారు. ప్రస్తుతం ఆ మొత్తం 10వేల డాలర్లు (రూ.6.14లక్షలు) ఉండగా దాన్ని ట్రూడో ప్రభుత్వ 20,635 డాలర్లు (రూ.12.7లక్షల)కు పెంచింది. జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. తాజా కఠిన నిర్ణయంతో భవిష్యత్‌లో కెనడాలో చదుకోవాలనుకునే విద్యార్ధుల భవిష్యత్‌ మరింత ఆందోళన కరంగా మారింది. 

సాధారణంగా భారతీయ విద్యార్ధులు కెనడాకు వెళ్లాలంటే..వారి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కనీసం రూ.6.14 లక్షలు ఉండాలి. అలా ఉంటేనే కెనడాకు వచ్చిన తర్వాత ఉపాధి లేకపోయినా ఆర్ధిక ఇబ్బందులు ఉండవనే ఈ షరతు విధిస్తుంది. ఇలా కెనడాయే కాదు.. ఇతర దేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్ధులు ఆయా దేశాల్ని బట్టి డిపాజిట్‌ మొత్తాన్ని సంబంధిత వీసా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. కెనడా రూ.6.14లక్షల డిపాజిట్‌ నిబంధనను 2000 నుంచి కొనసాగిస్తూ వచ్చింది.


 
కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ థ్రెషోల్డ్‌లో మార్పులు
ఈ నేపథ్యంలో కెనడా కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ థ్రెషోల్డ్‌ను మారుస్తున్నామని, తద్వారా పెరిగిపోతున్న కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇబ్బందుల నుంచి విద్యార్ధులకు ఉపశమనం కలుగుందని కెనడా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ అన్నారు. 

ఆర్ధిక ఇబ్బందులతో.. ఫుడ్‌ బ్యాంక్‌ల వైపు 
అద్దె చెల్లించలేక ఆర్ధిక సంక్షోభం పాటు ఆహారం కోసం ఫుడ్‌ బ్యాంక్‌ల వైపు మొగ్గు చూపుతున్నానే వార్తల నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడికి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు తగిన వసతి కల్పించని విద్యాసంస్థలపై ఇమిగ్రేషన్‌, రెఫ్యూజెస్‌ అండ్‌ సిటిజన్‌ షిప్‌ కెనడా (ఐఆర్‌సీసీ) చర్యలు తీసుకోనుంది. విద్యా సంస్థలు ఎంతమందికి వసతి సౌకర్యం కల్పిస్తాయో.. ఆ మేరకే విద్యార్ధులకు అనుమతులు ఇస్తాయని తాము భావిస్తున్నట్లు మార్క్‌ మిల్లర్‌ పేర్కొన్నారు. 

ఓ రకంగా మంచికే 
వీటితోపాటు అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్‌ బయట పని పరిమితిపై ఇచ్చిన మినహాయింపు (వారానికి 20 గంటల కంటే ఎక్కువ)ను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కెనడాలో ఉన్నవారితోపాటు డిసెంబర్‌ 7నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు.

>
మరిన్ని వార్తలు