టెక్‌ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే..

8 Dec, 2023 18:43 IST|Sakshi

Time’s CEO of the Year 2023: టెక్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT)కంపెనీ ఓపెన్‌ఏఐ (OpenAI) సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ ‘సీఈవో ఆఫ్‌ ది ఇయర్‌-2023’గా ఎంపికయ్యారు. ఆల్ట్‌మాన్ టెక్ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అవార్డు పొందారు. 

5 రోజుల్లోనే మిలియన్ యూజర్లు
2022 నవంబర్ లో ప్రారంభమైన చాట్‌జీపీటీ 5 రోజుల్లోనే మిలియన్ మంది యూజర్లను సంపాదించకుందని టైమ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది. చాట్‌జీపీటీకి ప్రస్తుతం 100 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ బెంచ్‌మార్క్‌ను చేరుకోవడానికి ఫేస్‌బుక్‌కు 4.5 సంవత్సరాలు పట్టింది. 

2022లో 28 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నివేదించిన ఓపెన్‌ఏఐ 2023లో నెలకు 100 మిలియన్‌ డాలర్ల ఆదాయానికి చేరుకుంది. ఓ వైపు చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ పింక్ స్లిప్‌లు ఇస్తున్న సమయంలో ఓపెన్‌ఏఐ మాత్రం నియామకాలు చేపట్టడం విశేషం. చాట్‌జీపీటీ భారీ విజయం తర్వాత ఈ ఏడాది మార్చిలో జీపీటీ-4ను ఓపెన్‌ఏఐ తీసుకొచ్చింది. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఓ వైపు యూఎస్‌ సెనేట్‌లో చర్చలు జరుగుతున్న సమయంలో ఆల్ట్‌మన్ భారత్‌, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు వెళ్లి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాముఖ్యత గురించి ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

మళ్లీ సీఈవోగా..
బోర్డు సభ్యులతో విభేదాల కారణంగా ఆల్ట్‌మన్ ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి వైదొలిగారు. గత నవంబర్ 17న బోర్డు ఆల్ట్‌మాన్‌ను కంపెనీ నుంచి తొలగించింది. ఈ ఘటన జరిగిన వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆల్ట్‌మన్‌కు అండగా నిలిచారు. మైక్రోసాఫ్ట్‌లో అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే 5 రోజుల నాటకీయ పరిణామాల అనంతరం ఆయన మళ్లీ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు.

>
మరిన్ని వార్తలు