టెక్‌ దిగ్గజం యాపిల్‌ను గడగడలాడిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌!?

17 Dec, 2023 12:50 IST|Sakshi

చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ను గడగడలాడిస్తున్నాడా? తమ దేశం కాదని ఇతర దేశాల్లో యాపిల్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్లను నెలకొల్పడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జిన్‌ పింగ్‌ నిర్ణయాలను చూస్తుంటే. 

ఇటీవల జిన్‌ పింగ్‌ ప్రభుత్వం దేశంలో మేడిన్‌ ఇన్‌ చైనా ఉత్పత్తులను ప్రోత్సహించాలని, ఐఫోన్‌లాంటి ఇతర దేశాలకు చెందిన ఉత్పత్తులను దేశంలో వినియోగించడాన్ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

  
డ్రాగన్‌ కంట్రీ స్థానికంగా తయారవుతున్న విదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ సంస్థలైన బ్యాంక్‌లు ఇతర రంగాల ప్రభుత్వ సంస్థలకు అవసరమయ్యే సాఫ్ట్‌వేర్‌లను దేశీయ సంస్థల నుంచి పొందాలని, అదే సమయంలో సెమీ కండక్టర్‌ పరిశ్రమ వృద్దిలో పాలు పంచుకోవాలని కోరింది. 

ఈ తరుణంలో కనీసం ఎనిమిది ప్రావిన్సుల్లోని పలు రాష్ట్ర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఉద్యోగులు స్థానికంగా తయారైన స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఇతర ఉత్పత్తులను ఉపయోగించాలని సూచించినట్లు బ్లూమ్‌ బర్గ్‌ నివేదిక తెలిపింది.

అంతవరకూ బాగున్నా..ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ ఉన్న జెజియాంగ్, షాన్డాంగ్, లియోనింగ్, సెంట్రల్ హెబీ వంటి ప్రావిన్సులకు చెందిన నగరాల్లోని సంస్థలు, ఏజెన్సీలకు ఈ ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. మేడిన్‌ ఇన్‌ చైనా నినాదం దేశ వ్యాప్తంగా అమలు చేయాలి గానీ.. కేవలం ఐఫోన్‌ తయారీ ప్రాంతాల్లో మాత్రమే అమలు చేయడం ఏంటని ఐఫోన్‌ లవర్స్‌ చర్చించుకుంటున్నారు.   


కాగా, సెప్టెంబర్‌ నెలలో కనీసం మూడు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లోని సిబ్బందికి కార్యాలయాల్లో ఐఫోన్లను ఉపయోగించవద్దని చైనా ప్రభుత్వం చెప్పినట్లు రాయిటర్స్ నివేదించింది. చివరిగా ఐఫోన్‌ల బ్యాన్‌ అంశంపై యాపిల్‌ కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

>
మరిన్ని వార్తలు