క్రిప్టో కింగ్ కిడ్నాప్ డ్రామా.. ప్రజలను నిండా ముంచి ప్రైవేట్ జెట్ కొనేసాడు!

27 Mar, 2023 16:13 IST|Sakshi

విలాసాలకు అలవాటు పడిన వ్యక్తి ఎంతకైనా తెలిగిస్తాడు, ఎంతమందినైనా మోసగిస్తాడు. గతంలో ఇలాంటి సంఘటనలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇటీవల అలాంటి మరో సంఘటన కెనడాలో తెరపైకి వచ్చింది.

క్రిప్టో కింగ్ 'ఐడెన్ ప్లెటర్‌స్కై' (Aiden Pleterski) కెనడాలో ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున మోసం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కారణంగానే ప్రస్తుతం ఇతనిపైన టోరంటోలో కేసు కూడా నడుస్తోంది. అధికారులు ఇతని వద్ద నుంచి మిలియన్ డాలర్లను తిరిగి వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం.

లగ్జరీ లైఫ్‌కి అలవాటుపడిన ఐడెన్ ఇన్వెస్టర్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసాడని కెనడాలోని బ్యాంక్‌రప్టసీ ట్రస్ట్ నివేదించింది. వారి వద్ద నుంచి సుమారు 40 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 330 కోట్లు కంటే ఎక్కువ) వసూలు చేసి కేవలం 2 శాతం మాత్రమే, అంటే రూ. 6 కోట్లు మాత్రమే పెట్టుబడులకు పెట్టాడని చెబుతున్నారు.

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే? ఐడెన్ ప్లెటర్‌స్కైని గత ఏడాది డిసెంబర్‌లో దక్షిణ ఒంటారియోకు చెందిన దుండగులు కిడ్నాప్‌ చేసారని, అక్కడే మూడు రోజులు బందించి మూడు మిలియన్ డాలర్లు (సుమారు 24 కోట్లు) ఇవ్వాలని చిత్ర హింసలు పెట్టినట్లు అతని తండ్రి చెప్పాడు. లగ్జరీ లైఫ్ అనుభవించే ఐడెన్ వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు మాత్రమే కాకుండా.. ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి మోసపోయిన ఇన్వెస్టర్ల డబ్బుని తిరిగి చెల్లిస్తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు