‘ఎఫ్‌2’లో కల్ట్‌ఫిట్‌కు వాటాలు

15 Feb, 2022 08:09 IST|Sakshi

న్యూఢిల్లీ: హెల్త్, వెల్‌నెస్‌ ప్లాట్‌ఫామ్‌ కల్ట్‌డాట్‌ఫిట్‌ తాజాగా ఎఫ్‌2 ఫన్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ ఇండియాలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించినదీ మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఎఫ్‌2 ఫన్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ సంస్థ.. భారత్‌లో గోల్డ్స్‌ జిమ్‌కు మాస్టర్‌ ఫ్రాంచైజీ పార్ట్‌నర్‌గా ఉంది. ప్రస్తుత గోల్డ్స్‌ జిమ్‌ సెంటర్ల ఆదాయాలను పెంచేందుకు, ఫ్రాంచైజీలను మరింతగా విస్తరించేందుకు కల్ట్‌డాట్‌ఫిట్‌ ఇన్వెస్ట్‌ చేయనుంది. అలాగే శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, భూటాన్‌ వంటి దేశాల్లోకి కూడా ఈ సెంటర్లను విస్తరించనుంది. గోల్డ్స్‌ జిమ్‌తో భాగస్వామ్యం తమ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టపర్చుకునేందుకు కూడా ఉపయోగపడగలదని కల్ట్‌డాట్‌ఫిట్‌ హెడ్‌ (గ్రోత్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగం) నరేశ్‌ కృష్ణస్వామి తెలిపారు. భారత్‌లో గోల్డ్స్‌ జిమ్‌ తదుపరి వృద్ధికి ఇది దోహదపడగలదని సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ నిఖిల్‌ కక్కర్‌ పేర్కొన్నారు. 

కల్ట్‌డాట్‌ఫిట్‌ గతేడాది డిసెంబర్‌లో ..  ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో సారథ్యంలోని ఇన్వెస్టర్ల నుంచి 150 మిలియన్‌ డాలర్ల మేర నిధులు సమీకరించింది. జొమాటో 100 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. దాదాపు 1.5 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో కల్ట్‌డాట్‌ఫిట్‌ .. యూనికార్న్‌ల (1 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌ గల స్టార్టప్‌లు) జాబితాలోకి చేరింది.  
 

మరిన్ని వార్తలు