సైయంట్‌ 5జీ నెట్‌వర్క్స్‌ సీవోఈ ఏర్పాటు

17 Feb, 2022 01:50 IST|Sakshi

హైదరాబాద్‌ ఐఐటీతో జట్టు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంజనీరింగ్, తయారీ, డిజిటల్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ సంస్థ సైయంట్‌ తాజాగా తమ ప్రైవేట్‌ 5జీ నెట్‌వర్క్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను (సీవోఈ) ఏర్పాటు చేసింది. దీనికి పరిశోధన భాగస్వామిగా హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ–హెచ్‌)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని సైయంట్‌ కేంద్రంలో ఈ సీవోఈని ఏర్పాటు చేశారు.

ప్రైవేట్‌ 5జీ నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు, పరీక్షించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఐఐటీ–హెచ్‌ అభివృద్ధి చేసిన 5జీ కోర్‌ ప్లాట్‌ఫామ్‌.. వివిధ అవసరాలకు ఏ విధంగా ఉపయోగపడగలదో ఇందులో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. అత్యాధునిక రీసెర్చ్, ఆవిష్కరణలకు పేరొందిన ఐఐటీ–హెచ్‌ అనుభవం .. సీవోఈకి ఎంతో ఉపయోగకరంగా ఉండగలదని సైయంట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌ అట్ల తెలిపారు. ఇప్పటికే వివిధ అంశాల్లో సైయంట్‌తో కలిసి పని చేస్తున్నామని, ప్రైవేట్‌ 5జీ సీవోఈతో ఈ బంధం మరింత బలపడగలదని ఐఐటీ–హెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి చెప్పారు. 

మరిన్ని వార్తలు