G20 Summit: దాదాపు రూ. 400కోట్లు నష్టం, వ్యాపారుల ఆందోళన

11 Sep, 2023 20:08 IST|Sakshi

సుమారు రూ.300-400 కోట్ల నష్టం: న్యూ ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్

జీ20 సమ్మిట్‌ ఖర్చు రూ 4120కోట్లు

బడ్జెట్‌లో కేటాయించింది రూ.990కోట్లు

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  (సెప్టెంబర్ 8-10) జీ20 సమ్మిట్‌ విజయవంతంగా ముగిసింది. అయితే  ఈ సందర్భంగా విధించిన ఆంక్షలు కారణంగా ట్రాఫిక్ నియంత్రణల కారణంగావ్యాపారులు భారీగా నష్టపోయినట్టు తెలుస్తోంది. ఇటీవల వర్షాలు, వరదలతో  కుదేలైన వ్యాపారాలు ఇది మరింత నష్టాన్ని మిగిల్చిందని  మార్కెట​్‌ వర్గాలు వాపోతున్నాయి. అంతేకాదు దాదాపు 9,000 మంది డెలివరీ కార్మికులను కూడా ప్రభావితం చేసిందట

జీ20 సదస్సు నిర్వహణకు సంబంధించిన ఆంక్షలతో  వ్యాపారులకు సుమారు రూ.300-400 కోట్ల నష్టం వాటిల్లిందని న్యూ ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అతుల్ భార్గవ వెల్లడించారు. షాపింగ్, డైనింగ్‌లకు ప్రసిద్ధి చెందిన ఖాన్ మార్కెట్, కన్నాట్ ప్లేస్, జన్‌పథ్ వంటి అగ్ర మార్కెట్‌లలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అలాగే  ట్రాఫిక్ ఆంక్షలు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి రావడంతో సంబంధి జోన్ బయట ఉన్న వ్యాపారాలు సైతం నష్టపోయాయని వెల్లడించారు.  ఎక్కువగా వారాంతపు షాపింగ్ వల్ల వచ్చే ఆదాయాన్ని కోల్పోయినట్లు తెలిపారు.

ఢిల్లీలో డైన్, డెలివరీ సంఖ్యలు రెండూ కనీసం 50శాతం తగ్గాయనీ ఎన్‌సిఆర్‌లో అమ్మకాలు 20శాతం  వరకు క్షీణించాయని స్పెషాలిటీ రెస్టారెంట్ల ఛైర్మన్ అంజన్ ఛటర్జీ తెలిపారు.  లాంగ్ వీకెండ్‌లో (సెప్టెంబర్ 8-10) వ్యాపార అవకాశాలను కోల్పోయామని పంజాబ్ గ్రిల్, జాంబర్  అండ్‌ యూమీ చైన్‌లను నిర్వహిస్తున్న లైట్ బైట్ ఫుడ్స్ డైరెక్టర్ రోహిత్ అగర్వాల్ వెల్లడించారు.

జీ20 ఖర్చు .4,100 కోట్లు :బడ్జెట్‌లో కేటాయించింది రూ.990కోట్లే
G20 సమ్మిట్ ఈవెంట్‌కు సంబంధించిన మొత్తంగా రూ. 4,100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వ రికార్డుల ప్రకారం ల ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరిలో ప్రకటించిన 2023-24 బడ్జెట్‌లో G20 అధ్యక్ష పదవికి రూ.990 కోట్లు కేటాయించారు. అంటే ఈ మొత్తం బడ్జెట్‌లో కేటాయించిన మొత్తానికి నాలుగు రెట్లు ఎక్కువ. ఈ ఈవెంట్‌ జరిగిన సెప్టెంబర్ 8 - 10 మధ్య  ఢిల్లీ  చుట్టుపక్కల ఆంక్షలతోపాటు, అన్ని వాణిజ్య , ఆర్థిక సంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు