కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్లకే మొగ్గు

12 Sep, 2020 06:05 IST|Sakshi

ఆన్‌లైన్, మొబైల్‌ ద్వారా చెల్లింపులు

ఎఫ్‌ఐఎస్‌ తాజా సర్వేలో వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 విస్తృతి కారణంగా దేశంలో డిజిటల్‌ బ్యాంకింగ్, కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. నగదుకు బదులుగా డిజిటల్, కాంటాక్ట్‌ రహిత చెల్లింపులకే కస్టమర్లు మొగ్గుచూపుతున్నారని ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ టెక్నాలజీ కంపెనీ ఎఫ్‌ఐఎస్‌ సర్వేలో తేలింది. పేస్‌ పల్స్‌ పేరుతో చేపట్టిన ఈ సర్వేలో 2,000 మంది పాలుపంచుకున్నారు. 68 శాతం మంది ఆన్‌లైన్‌ లేదా మొబైల్‌ బ్యాంకింగ్‌ విధానంలో లావాదేవీలు జరుపుతున్నారు. మహమ్మారి తదనంతరం కూడా ఈ విధానాన్నే అనుసరిస్తామని 51 శాతం మంది స్పష్టం చేశారు. భవిష్యత్తులో క్యాష్, కార్డ్స్‌కు బదులుగా కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్లను జరుపుతామని 48 శాతం మంది వెల్లyì ంచారు.

మొబైల్‌ వాలెట్లతో..
భారత్‌లో మొబైల్‌ పేమెంట్‌ వాలెట్ల వినియోగమూ అంతకంతకూ పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 2020 ఫిబ్రవరిలో మొబైల్‌ వాలెట్ల ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 124.3 కోట్లు. మే నాటికి ఇది రెండింతలకుపైగా చేరి 253.2 కోట్లకు ఎగసింది. లావాదేవీల విలువ ఇదే కాలంలో రూ.2,836 కోట్ల నుంచి రూ.11,080 కోట్లకు చేరింది. సర్వేలో పాలుపంచుకున్న వారిలో 93 శాతం మందికిపైగా మొబైల్‌ వాలెట్లను వాడుతున్నారు. వీరిలో 24–39 ఏళ్ల వయసున్నవారే అధికం. చెల్లింపు అభిరుచులు రానున్న రోజుల్లో ఇదే విధంగా ఉంటాయని ఎఫ్‌ఐఎస్‌ ఎండీ మహేశ్‌ రామమూర్తి తెలిపారు. ఈ మార్పులకు తగ్గట్టుగా ఫైనాన్షియల్‌ సంస్థలు, విక్రయదారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఆర్థికంగా కరోన ప్రభావం..
ప్రజలపై కరోన ఆర్థికంగానూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉపాధికి సంబంధించిన సమస్యలను 70 శాతం మంది ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా తమ జీతాల్లో కోత పడిందని 49 శాతం మంది తెలిపారు. ఉద్యోగాలు తాత్కాలికంగా కోల్పోయామని 20 శాతం, శాశ్వతంగా పోయిందని 10 శాతం మంది చెప్పారు. 20 శాతం మందికి పదోన్నతి, 18 శాతం మందికి వేతనం పెంపు, 23 శాతం మందికి బోనస్‌ వాయిదా పడిందని వివరించారు. ఆదాయం తగ్గితే ఆర్థికంగా మూడు నెలలకు మించి భారాన్ని తట్టుకోలేమని 48 శాతం మంది వెల్లడించారు. ఆర్థిక ముప్పు అధికంగా యువ జంటలకే ఉందని సర్వే తేల్చి చెప్పింది. మహిళలపైనా ఈ ప్రభావం ఉందని పేర్కొంది.  

మరిన్ని వార్తలు