దేశీ మార్కెట్‌పై గ్లోబల్‌ దిగ్గజాల కన్ను

28 Feb, 2023 00:35 IST|Sakshi

కన్జూమర్‌ ప్రొడక్టుల విక్రయాలపై భారీ ఆశలు

జాబితాలో పెప్సీకో, కోకకోలా, మాండెలెజ్‌

యూనిలీవర్, లారియల్‌ కొత్త వ్యూహాలు

ముంబై: కన్జూమర్‌ ప్రొడక్టుల గ్లోబల్‌ దిగ్గజాలు దేశీ వినియోగ మార్కెట్‌పై సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రధానంగా పెప్సీకో, కోకకోలా, మాండెలెజ్‌ యూనిలీవర్, లారియల్‌  దేశీయంగా పటిష్ట అమ్మకాలు సాధించాలని ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వృద్ధి పరిస్థితులు సహకరించనున్నట్లు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులకుతోడు, స్థూల ఆర్థిక వాతావరణం అనిశ్చింతగా ఉన్నప్పటికీ ఇండియా గ్రోత్‌ స్టోరీ పలు అవకాశాలను కల్పించనున్నట్లు అంచనా వేస్తున్నాయి. గత కేలండర్‌ ఏడాది(2022)లో పటిష్ట అమ్మకాలు సాధించడంతో ఈ ఏడాది(2023)లోనూ మరింత మెరుగైన పనితీరును సాధించాలని ఆశిస్తున్నాయి. 2022 ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ కన్జూమర్‌ ప్రొడక్ట్‌ దిగ్గజాలు పలు అంచనాలను ప్రకటించాయి.

మార్కెట్‌ను మించుతూ
సౌందర్య కేంద్రంగా ఆవిర్భవించే బాటలో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నట్లు కాస్మెటిక్‌ ప్రొడక్టుల దిగ్గజం లారియల్‌  పేర్కొంది. గతేడాది పటిష్ట అమ్మకాలు సాధించామని, మార్కెట్‌ను మించి రెండు రెట్లు వృద్ధిని అందుకున్నట్లు తెలియజేసింది. ఇండియా తమకు అత్యంత ప్రాధాన్యతగల మార్కెట్‌ అని పేర్కొంటూ భారీ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది. గణాంకాల ప్రకారం చూస్తే 2030కల్లా ఇండియా ప్రపంచ జనాభాలో 20 శాతం వాటా, నైపుణ్యంగల సిబ్బందిలో 30 శాతం వాటాను ఆక్రమించుకోనున్నట్లు అభిప్రాయపడింది. వెరసి కంపెనీ వృద్ధికి దేశీ మార్కెట్‌ కీలకంగా నిలవనున్నట్లు తెలియజేసింది.

పానీయాలకు భళా
2022కు పానీయాల అమ్మకాల్లో ఇండియా మార్కెట్‌ అత్యుత్తమంగా నిలిచినట్లు కోకకోలా చైర్మన్, సీఈవో జేమ్స్‌ క్విన్సీ పేర్కొన్నారు. పానీయాల విభాగంలో ఇండియా మార్కెట్‌ అత్యంత భారీగా విస్తరించే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో పలు అవకాశాలకు తెరలేవనున్నట్లు తెలియజేశారు. బెవరేజెస్‌ వినియోగంలో దీర్ఘకాలిక మార్కెట్‌గా నిలవనున్నదని, ఇకపై మరింత వృద్ధికి వీలున్నదని అంచనా వేశారు. వినియోగ రంగంలో 2022లో దేశీయంగా విస్తారమైన వృద్ధి నమోదైనట్లు యూనిలీవర్‌ పేర్కొంది. పోటీతత్వం, విభిన్న బ్రాండ్లు, ధరల పోర్ట్‌ఫోలియో ద్వారా వినియోగదారులను ఆకట్టుకున్నట్లు వివరించింది. గ్రామీణ ప్రాంతాలకుమించి పట్టణాలలో విక్రయాలు ఊపందుకున్నట్లు కంపెనీ సీఈవో అలెన్‌ జోప్‌ వెల్లడించారు. ఇకపైన సైతం మార్కెట్‌ను మించిన వృద్ధిని అందుకోగలమని భావిస్తున్నట్లు తెలియజేశారు.

రెండంకెల వృద్ధి
2022లో దేశీయంగా రెండంకెల వృద్ధిని అందుకున్నట్లు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం మాండెలెజ్‌ తెలియజేసింది. ప్రధానంగా చాకొలెట్లు, బిస్కట్లతోకూడిన పోర్ట్‌ఫోలియో జోరు చూపినట్లు పేర్కొంది. గతేడాది ఇండియా, బ్రెజిల్‌ మార్కెట్‌లలో అత్యధిక స్థాయిలో అమ్మకాలు సాధించినట్లు వెల్లడించింది. ఇక బెవరేజెస్‌ దిగ్గజం పెప్సీకో సైతం దేశీయ మార్కెట్లో గతేడాది అత్యంత పటిష్ట వృద్ధిని సాధించినట్లు తెలియజేసింది. పానీయాలతోపాటు.. స్నాక్స్‌ అమ్మకాల ద్వారా మార్కెట్‌ వాటాను పెంచుకున్నట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తలు