విమానాశ్రయాలపై రూ.20,000 కోట్లు

21 Aug, 2021 00:47 IST|Sakshi

జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు

నాలుగేళ్లలో నాగ్‌పూర్‌ ప్రాజెక్ట్‌ తొలిదశ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుతమున్న విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి రూ.20,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు మౌలిక రంగ సంస్థ జీఎంఆర్‌ గ్రూప్‌ వెల్లడించింది. విమానాశ్రయాల అభివృద్ధి, నిర్మాణంలో ప్రపంచస్థాయి ప్రమాణాలను ఏర్పరిచామని కంపెనీ వార్షిక నివేదికలో గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు తెలిపారు. ‘ఢిల్లీ విమానాశ్రయంలో ప్రస్తుతం మౌలిక వసతుల విస్తరణ, టెర్మినల్‌ వార్షిక సామర్థ్యం 10 కోట్ల ప్రయాణికుల స్థాయికి పెంపు పనులు జరుగుతున్నాయి.

ఫేజ్‌ 3ఏ విస్తరణ 2023 జూన్‌ నాటికి పూర్తి కానుంది. 2022 సెప్టెంబర్‌ నాటికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వార్షిక సామర్థ్యం 3.5 కోట్ల ప్రయాణికుల స్థాయికి చేరుకుంటుంది’ అని వివరించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, కర్ణాటకలోని బీదర్, ఫిలి ప్పైన్స్‌లోని మక్టన్‌ సెబు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ నిర్వహిస్తోంది.


నాగ్‌పూర్‌ విమానాశ్రయం..: నాగ్‌పూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ విషయంలో జీఎంఆర్‌కు అనుకూలంగా బాంబే హైకోర్ట్‌ నాగ్‌పూర్‌ బెంచ్‌ తీర్పు వెలువరించిన నేపథ్యంలో కంపెనీ తదుపరి ప్రణాళిక వెల్లడించింది. నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆధునీకరణ, అభివృద్ధిలో భాగంగా వార్షిక సామర్థ్యాన్ని రాబోయే కాలంలో 3 కోట్ల ప్రయాణికుల స్థాయికి చేర్చనున్నారు. నాలుగేళ్లలో పూర్తి కానున్న తొలి దశలో 40 లక్షల ప్రయాణికులు, 20,000 మెట్రిక్‌ టన్నుల కార్గోను నిర్వహించే స్థాయికి విమానాశ్రయం చేరనుంది.

మరిన్ని వార్తలు