Go First bankruptcy: 30 రోజుల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వండి

26 May, 2023 00:26 IST|Sakshi

గో ఫస్ట్‌కు డీజీసీఏ సూచన

న్యూఢిల్లీ: కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికను 30 రోజుల్లోగా సమర్పించాలంటూ విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) సూచించింది. అందుబాటులో ఉన్న విమానాలు .. పైలట్లు ..ఇతర సిబ్బంది, నిర్వహణ ఏర్పాట్లు, నిధులు .. వర్కింగ్‌ క్యాపిటల్, లీజుదార్లతో ఒప్పందాలు తదితర వివరాలు అందులో పొందుపర్చాలని డీజీసీఏ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రణాళికను సమీక్షించిన తర్వాత డీజీసీఏ తగు నిర్ణయం తీసుకోవచ్చని వివరించాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్‌ మే 2న స్వచ్ఛందంగా దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

ముందుగా మే 3, 4 తారీఖుల్లో రద్దు చేసిన విమాన సేవలను ఆ తర్వాత మరిన్ని రోజులకు పొడిగించింది. ఈలోగా సర్వీసుల నిలిపివేతపై డీజీసీఏ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. దీంతో మారటోరియం వ్యవధిని ఉపయోగించుకుని పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించేందుకు సమయం ఇవ్వాలంటూ గో ఫస్ట్‌ తన సమాధానంలో కోరింది. మరోవైపు లీజుదార్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. గో ఫస్ట్‌ దివాలా పరిష్కార పిటిషన్‌ను అనుమతించాలని ఎన్‌సీఎల్‌టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ మే 22న జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఉత్తర్వులు జారీ చేసింది.

>
మరిన్ని వార్తలు