సంక్షోభం అంచున పాక్.. ఇంధన లేమితో 48 విమానాలు రద్దు

18 Oct, 2023 11:25 IST|Sakshi

ఇస్లామాబాద్‌:  పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారిపోతోంది. తాజాగా ఇంధనం లేని కారణంగా పాక్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) 48 జాతీయ, అంతర్జాతీయ విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. 

ఇంధనం పరిమితంగా ఉండటం వల్ల విమానాలు  రద్దు చేయాల్సి వచ్చిందని, కొన్ని విమాన సర్వీసులను రీషెడ్యూల్‌ కూడా చేశామని పీఐఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటివరకూ మొత్తం 13 దేశీ, 11 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసినట్లు చెప్పారు. అలాగే 12 విమానాలను షెడ్యూల్‌ మార్చామని అన్నారు. రద్దు చేసిన విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రయాణీకులు ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందే పీఐఏ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాలని కోరారు. బుధవారం మరో 16 విమానాలను రద్దు చేశామని, మరోకొన్ని ఆలస్యం కానున్నాయని చెప్పారు. 

 బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వ చమురు సంస్థ (PSO) పీఐఏకు ఇంధన సరఫరా నిలిపివేయడంతో ఈ సంక్షోభం తలెత్తినట్లు సమాచారం. దీంతో పీఐఏకు ఇంధన కొరత ఏర్పడింది. మరోవైపు రుణభారం పెరిగిపోతున్న నేపథ్యంలో పీఐఏను ప్రైవేట్‌ పరం చేసేందుకూ ఆలోచనలు నడుస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను అధిగమించేందుకు రోజూ వారి ఖర్చుల కోసం రూ. 23 బిలియన్ల పాయం అందించాలని పీఐఏ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇటీవలే కోరింది. కానీ ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు.

PSO నుంచి ఇంధన సరఫరా కోసం రోజుకు రూ.100 మిలియన్లు అవసరమవుతాయి. అడ్వాన్స్ పేమెంట్లు మాత్రమే అని పీఎస్‌ఓ కొత్తగా డిమాండ్ చేయటంతో పీఐఏ చేతులెత్తేసింది. భవిష్యత్తులో మరిన్ని విమానాల రాకపోకలు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో దాయాది పాకిస్థాన్‌ గత కొంతకాలంగా సతమతమవుతోంది. ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోగా.. ప్రజలు, ప్రభుత్వాలకు ఇబ్బందులు తప్పట్లేదు. 

ఇదీ చదవండి: దాడుల్ని ఆపితే.. బందీలను వదిలేస్తాం: హమాస్

మరిన్ని వార్తలు