పసిడి- వెండి.. మెరుస్తున్నాయ్

3 Aug, 2020 10:27 IST|Sakshi

రూ. 54,000 చేరువలో 10 గ్రాముల పసిడి

ఎంసీఎక్స్‌లో రూ. 65,650 వద్ద వెండి

1992 డాలర్లకు చేరిన కామెక్స్‌ ధరలు

జులైలో 10 శాతం ర్యాలీ చేసిన బంగారం

31 శాతం దూసుకెళ్లిన వెండి ఫ్యూచర్స్‌

అటు కేంద్ర బ్యాంకులకూ, ఇటు ప్రజలకూ ప్రియమైన బంగారం, వెండి ధరలు మరింత ప్రియమయ్యాయి. ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 0.3 శాతం బలపడి 1992 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి 1.2 శాతం పుంజుకుని 24.5 డాలర్లను తాకింది. కాగా.. పసిడి స్పాట్‌ మార్కెట్లో 1974 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. ఇక దేశీయంగా ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 72 లాభపడి రూ. 53,900కు చేరింది. ఇది ఆగస్ట్‌ ఫ్యూచర్స్‌ ధరకాగా.. సెప్టెంబర్ ఫ్యూచర్స్‌ వెండి కేజీ ధర రూ. 658 పెరిగి రూ. 65,642 వద్ద ట్రేడవుతోంది. 

జులైలో జోరు
గత 8ఏళ్లలోలేని విధంగా విదేశీ మార్కెట్లో పసిడి ధరలు జులైలో 10.3 శాతం ర్యాలీ చేశాయి. వారాంతానికల్లా కామెక్స్‌ పసిడి ఔన్స్‌ 1986 డాలర్లకు చేరింది. ఈ బాటలో వెండి మరింత మెరిసింది. ఏకంగా 31 శాతం దూసుకెళ్లి 24.2 డాలర్ల వద్ద నిలిచింది. వెరసి సరికొత్త రికార్డ్‌ సాధించింది. ఒక నెలలో వెండి ఈస్థాయిలో లాభపడటం చరిత్రలో ఇదే తొలిసారని బులియన్‌ విశ్లేషకులు తెలియజేశారు. గత వారం ఇంట్రాడేలో కామెక్స్‌ పసిడి 2005 డాలర్లను తాకడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం విదితమే.

దేశీయంగానూ
దేశీయంగా ఫ్యూచర్స్‌ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు జులైలో జోరు చూపాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి 9.5 శాతం పురోగమించి రూ. 53,544ను తాకింది. ఇక వెండి 29 శాతం జంప్‌చేసి కేజీ రూ. 64,984 వద్ద స్థిరపడింది. కామెక్స్‌లో పసిడి  1835-1840 డాలర్లను అధిగమించడంతో స్వల్ప కాలంలో ధరలు ఈ స్థాయికి ఎగువనే నిలదొక్కుకోగలవని బులియన్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పసిడి ధరలు తదుపరి 2020-2030 డాలర్లను అందుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.  అయితే 1920 డాలర్ల దిగువకు చేరితే మరింత బలహీనపడవచ్చని విశ్లేషించారు.

వెండి సంగతేంటి?
కొద్ది నెలల కన్సాలిడేషన్‌ తదుపరి జోరందుకున్న వెండి జులైలో పటిష్ట బ్రేకవుట్‌ను సాధించినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. కీలకమైన 20 డాలర్లకు ఎగువన నిలవడంతో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నట్లు తెలియజేశారు. తదుపరి కాలంలో 26 డాలర్లను తాకవచ్చని అంచనా వేశారు. అయితే 22 డాలర్ల దిగువకు చేరితే వెనకడుగు వేయవచ్చని అభిప్రాయపడ్డారు. 

ఎంసీఎక్స్‌ అంచనాలు ఇలా
ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ఫ్యూచర్స్‌ ధరలు రూ. 51,000కు ఎగువన నిలవడంతో సమీపకాలంలో రూ. 55,200-55,500ను తాకవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రూ. 51,000 దిగువకు చేరితే మరింత నీరసించవచ్చని అంచనా వేశారు. ఇక వెండికి సమీపకాలంలో రూ. 69,000 టార్గెట్‌ను ఊహిస్తున్నారు. అయితే రూ. 60,000-60,500 వద్ద మద్దతును కోల్పోతే మరింత క్షీణించే వీలున్నదని అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు