పసిడి, వెండి ధరల నేలచూపు

11 Nov, 2020 10:44 IST|Sakshi

రూ. 50,426 వద్ద ట్రేడవుతున్న 10 గ్రాముల బంగారం

ఎంసీఎక్స్‌లో రూ. 62,800 వద్ద కదులుతున్న వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,878 డాలర్లకు

24.45 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

మంగళవారం కోలుకున్న పసిడి, వెండి ధరలు

న్యూయార్క్/ ముంబై : ముందురోజు బౌన్స్‌బ్యాక్‌ అయిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం మందగమన బాట పట్టాయి. అటు న్యూయార్క్‌ కామెక్స్‌లో అక్కడక్కడే అన్నట్లుగా కదులుతుంటే.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లో వెనకడుగుతో ట్రేడవుతున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 90 శాతం విజయవంతమైనట్లు అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించడంతో సోమవారం విదేశీ మార్కెట్లో పసిడి ధరలు 5 శాతంపైగా కుప్పకూలిన విషయం విదితమే. కాగా.. ఎంసీఎక్స్‌లో మంగళవారం పసిడి రూ. 700 పుంజుకోగా.. వెండి సుమారు రూ. 2,000 జంప్‌ చేసింది. వివరాలు చూద్దాం..

వెనకడుగులో..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 75 తక్కువగా రూ. 50,426 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,463 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,350 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 244 క్షీణించి రూ. 62,800 వద్ద కదులుతోంది. తొలుత రూ. 63,044 వరకూ బలపడిన వెండి తదుపరి రూ. 62,998 వరకూ నీరసించింది. 

అక్కడక్కడే.. 
న్యూయార్క్‌ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఫ్లాట్‌గా కదులుతున్నాయి. ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో1,878 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ స్వల్పంగా 0.16 శాతం బలపడి 1,880 డాలర్లకు చేరింది. వెండి దాదాపు యథాతథంగా ఔన్స్ 24.45 డాలర్ల వద్ద కదులుతోంది. 

మరిన్ని వార్తలు