బంగారం, వెండి ధరలకూ వైరస్‌ సెగ

29 Oct, 2020 12:08 IST|Sakshi

రూ. 50,415 వద్ద కదులుతున్న 10 గ్రాముల బంగారం

ఎంసీఎక్స్‌లో రూ. 60,250 వద్ద ట్రేడవుతున్న కేజీ వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,883 డాలర్లకు

23.50 డాలర్ల వద్ద ట్రేడవుతున్న ఔన్స్‌ వెండి

సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికా, యూరోపియన్‌ దేశాలలో కోవిడ్‌-19 కేసులు ఉధృతంకావడంతో బుధవారం స్టాక్‌ మార్కెట్లతోపాటు.. పసిడి, వెండి తదితర విలువైన లోహాలు డీలాపడ్డాయి. అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు 2.5- 4 శాతం మధ్య పతనంకాగా.. న్యూయార్క్‌ కామెక్స్‌లో పసిడి ఔన్స్‌ దాదాపు 2 శాతం క్షీణించి 1879 డాలర్ల వద్ద ముగిసింది. వెండి సైతం ఔన్స్‌ 23.36 డాలర్ల వద్ద నిలిచింది. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్యాకేజీని ఆమోదించడంలో యూఎస్‌ కాంగ్రెస్‌ విఫలంకావడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 93.50కు బలపడింది. కాగా.. పసిడి, వెండి ధరలు న్యూయార్క్‌ కామెక్స్‌లో ముందురోజు నష్టాల నుంచి కోలుకుని లాభాలతో కదులుతుంటే.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లో అటూఇటుగా ట్రేడవుతున్నాయి. 

మిశ్రమ బాట
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం  రూ. 80 క్షీణించి రూ. 50,415 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 112 బలపడి రూ. 60,250 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో 50,488 వద్ద గరిష్టాన్నితాకిన పసిడి 50,375 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇదే విధంగా తొలుత ఒక దశలో 60,319 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 59,930 వరకూ క్షీణించింది. 

కామెక్స్‌లో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో బుధవారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం లాభాలతో కదులుతున్నాయి. ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.2 శాతం బలపడి 1,883 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.3 శాతం వృద్ధితో 1,883 డాలర్లకు చేరింది. వెండి 0.6 శాతం పుంజుకుని ఔన్స్ 23.50 డాలర్ల వద్ద కదులుతోంది. 

వెనకడుగు..
ఎంసీఎక్స్‌లో బుధవారం 10 గ్రాముల బంగారం రూ. 452 క్షీణించి రూ. 50,509 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,065 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,230 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 2,082  పతనమై రూ. 60,199 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,500 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 59,100 వరకూ వెనకడుగు వేసింది. 

మరిన్ని వార్తలు