Aadhaar-based UPI: ఆధార్‌తో యూపీఐ పేమెంట్‌: గూగుల్‌పేలో కొత్త ఫీచర్‌

7 Jun, 2023 14:13 IST|Sakshi

Aadhaar-based UPI: గూగుల్‌పే (Google Pay) యూజర్లకు కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఆధార్‌తో యూపీఐ చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కు యూజర్లు గూగుల్‌పే యాప్‌లో నమోదు చేసుకోవచ్చు.

డెబిట్‌ కార్డుతో పనిలేదు
ఆధార్ ఆధారిత యూపీఐ ఆన్‌బోర్డింగ్ విధానం ద్వారా గూగుల్‌పే యూజర్లు డెబిట్ కార్డ్ లేకుండానే తమ యూపీఐ పిన్‌ని సెట్ చేసుకోవచ్చు. కోట్లాది మంది యూపీఐ చెల్లింపులను వినియోగిస్తున్న నేపథ్యంలో ఇది చాలా మంది వినియోగదారులకు యూపీఐ ఐడీలను సెటప్ చేసుకునేందుకు, డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఈ ఫీచర్‌ వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: Retrieve Aadhaar card: ఆధార్‌ కార్డ్‌ పోయిందా.. నంబర్‌ కూడా గుర్తులేదా.. ఎలా మరి?

ఆధార్‌తో యూపీఐ పేమెంట్‌ అవకాశం ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల కస్టమర్లకు మాత్రమే ఉండగా త్వరలో మరిన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆధార్ ద్వారా యూపీఐ చెల్లింపులను వినియోగించుకోవాలంటే ఆధార్‌, బ్యాంక్‌లో నమోదు చేసుకున్న ఫోన్ నంబర్ ఒకటే అయి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి.

నమోదు చేసుకోండిలా..
గూగుల్‌పే యాప్‌లో వినియోగదారులు డెబిట్ కార్డ్ లేదా ఆధార్ ఆధారిత యూపీఐ నమోదును ఎంపిక చేసుకోవచ్చు. ఆధార్‌ని ఎంచుకుంటే నమోదు ప్రక్రియను ప్రారంభించడానికి వారి ఆధార్ నంబర్‌లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేయాలి. ప్రామాణీకరణ దశను పూర్తి చేయడానికి ఆధార్‌ (UIDAI), బ్యాంక్ నుంచి వచ్చిన ఓటీపీలను నమోదు చేయాలి. తర్వాత ప్రక్రియను బ్యాంక్‌ పూర్తి చేశాక యూపీఐ పిన్‌ని సెట్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: ఆధార్‌ కొత్త ఫీచర్‌: ఓటీపీ మీ మొబైల్‌ నంబర్‌కే వస్తోందా?

కస్టమర్‌లు లావాదేవీలు చేయడానికి లేదా బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి గూగుల్‌ యాప్‌ని ఉపయోగించవచ్చు. ఆధార్ నంబర్‌లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేసిన తర్వాత, అది ధ్రువీకరణ కోసం NPCI ద్వారా UIDAIకి వెళ్తుంది. ఈ ప్రక్రియ వినియోగదారుల ఆధార్ నంబర్ భద్రతను నిర్ధారిస్తుంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే గూగుల్‌పే ఆధార్ నంబర్‌ను స్టోర్‌ చేయదు. ధ్రువీకరణ కోసం NPCIతో ఆధార్ నంబర్‌ను భాగస్వామ్యం చేయడంలో కేవలం ఫెసిలిటేటర్‌గా మాత్రమే పనిచేస్తుంది.

మరిన్ని వార్తలు