రూ. 1.75 లక్షల కోట్లు టార్గెట్‌..! ప్రైవేటుపరం కానున్న 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు..!

24 Nov, 2021 20:29 IST|Sakshi

పలు ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగంగా చేపట్టనుంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్‌పరం చేసే దిశగా అడుగులు పడుతున్నట్లుగా కన్పిస్తోంది. అందుకోసం రానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం సుమారు 26 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో బ్యాంకింగ్‌ చట్టసవరణ బిల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 
చదవండి: ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం, అంబానీకి షాక్‌ ఇచ్చిన గౌతమ్‌ అదానీ

రూ.1.75 లక్షల కోట్లే లక్ష్యంగా..!
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి సుమారు రూ.1. 75 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా కేంద్రం బ్యాంకులపై తీసుకువస్తోన్న బిల్లుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకుగానూ 1970, 1980 బ్యాంకింగ్ కంపెనీల చట్టంతో పాటుగా 1949 బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌కు సవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో మరో కీలకమైన పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్ట సవరణ బిల్లును కూడా కేంద్రం ప్రవేశ పెట్టనుంది.  ఈ బిల్లుతో ద్వారా విస్తృతమైన పెన్షన్ కవరేజీని ప్రోత్సహించడానికి పీఎఫ్‌ఆర్‌డీఏ  నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌ను వేరు చేయడానికి వీలు కల్గుతుందని గత బడ్జెట్‌ సెషన్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది. 
చదవండి: 81 కోట్ల రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త!

మరిన్ని వార్తలు