బ్యాంక్‌ షేర్లలో తాజా కొనుగోళ్లు

22 Sep, 2023 06:13 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ ఫండ్‌కు ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడుల్లో భాగంగా ఫెడరల్‌ బ్యాంక్, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌సహా పలు బ్యాంకులలో అదనపు వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకు ఆర్‌బీఐ నుంచి తాజాగా అనుమతులు లభించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ వెల్లడించింది. వెరసి అనుమతి పొందిన బ్యాంకులలో వాటాను 9.5 శాతంవరకూ పెంచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు తెలియజేసింది. బ్యాంకులలో అదనపు పెట్టుబడులను చేపట్టేందుకు పెట్టుకున్న దరఖాస్తుకు ఆర్‌బీఐ క్లియరెన్స్‌ ఇచి్చనట్లు వివరించింది.

హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి పొందిన జాబితాలో డీసీబీ బ్యాంక్, కరూర్‌ వైశ్యా బ్యాంక్, సిటీ యూనియన్‌ బ్యాంక్‌ సైతం ఉన్నాయి. మరోవైపు చెల్లించిన మూలధనం లేదా వోటింగ్‌ హక్కులలో 9.5 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీకి ఆర్‌బీఐ నుంచి అనుమతి లభించినట్లు విడిగా ఈక్విటాస్‌ ఎస్‌ఎఫ్‌బీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా.. 2023 జూన్‌30కల్లా ఫెడరల్‌ బ్యాంక్‌లో 4.49 శాతం, ఈక్విటాస్‌ ఎస్‌ఎఫ్‌బీలో 4.68 శాతం చొప్పున హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ వాటాలు కలిగి ఉంది. అయితే తాజా కొనుగోళ్ల తదుపరి ఒక్కో బ్యాంకులో 9.5 శాతం వాటాను మించేందుకు అనుమతించరు. 

మరిన్ని వార్తలు